తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఏపీలోనూ ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రక్తదాన శిబిరాలు, అన్నదానాలతో పాటు పలు నిర్భాగ్యుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆలయాల్లో కేసీఆర్ పేరుపైన ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు. అయితే, ఆయనకు అభిమానులు తెలంగాణలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉన్నారు. గతంలో ఎన్నో సార్లు ఈ విషయం నిరూపితం అయింది. 


తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోనూ ఆయన పుట్టిన రోజు హడావుడి కనిపించింది. కడియం నర్సరీల్లో (కడియపు లంక) సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను అక్కడి రైతులు వినూత్నంగా నిర్వహించారు. మొక్కలు, కూరగాయలు, పువ్వులతో సీఎం కేసీఆర్ అద్భుతమైన చిత్రాన్ని ప్రదర్శించారు. ఏపీ ప్రజలు కూడా ఆయన వెన్నంటే ఉన్నారనే సందేశం అందించారు. కడియపులంక గ్రీన్ లైఫ్ నర్సరీలో తెలంగాణ చిత్రపటం మధ్యలో కేసీఆర్ బొమ్మ వేసి రూపొందించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.






ఒడిశా తీరంలోనూ సైకత శిల్పం
 మరోవైపు, ఒడిశాలోని పూరీ జగన్నాథుడి చెంత కూడా కేసీఆర్ పుట్టిన రోజు సందడి కనిపించింది. సముద్ర తీరంలో పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పాన్ని రూపొందించారు. సిద్దిపేటకు చెందిన వంగ రాజేశ్వర్ రెడ్డి సమన్వయంతో సుదర్శన్ పట్నాయక్ ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఒడిశాలో సీఎం కేసీఆర్ సైకత శిల్పాన్ని తయారు చేశారు. ‘ది ఫైటర్, అడ్మినిస్ట్రేటర్, ది విజనర్’ అని రాసి శుభాకాంక్షలు తెలియజేశారు. 


ఇప్పటివరకు ముఖ్యమంత్రుల్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సైకత శిల్పాన్ని మాత్రమే సుదర్శన్ పట్నాయక్ రూపొందించారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన సైకత శిల్పాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎంతో ఆకర్షణీయంగా రూపొందించిన సీఎం కేసీఆర్ సైకత చిత్రాన్ని పూరీ బీచ్ వద్ద పర్యాటకులు ఆసక్తికరంగా తిలకించారు. ఆ వీడియో, ఫొటోలు సోషల్‌ మీడియాకు ఎక్కి రచ్చ చేస్తున్నాయి.