TDP News In Telugu: ఎన్నికల వేళ సోషల్ మీడియా ప్రచారం విషయంలో టీడీపీ (TDP) చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. పాజిటివ్ ప్రచారంకోసం ప్రయత్నించే క్రమంలో పార్టీని ఇబ్బంది పెట్టే పోస్టింగ్ లు వద్దంటూ సోషల్ మీడియా (TDP Social Media) యాక్టివిస్ట్ లకు పలు సూచనలు చేసింది తెలుగు దేశం అధిష్టానం. అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఆ సమాచారాన్ని ఉంచింది. చేయాల్సినవి, చేయకూడనివి అంటూ జాబితా విడుదల చేశారు. 


చేయాల్సినవి.. 
- టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులు, అభివృద్ధి, సంక్షేమం, పార్టీ నాయకత్వం యొక్క దూరదృష్టి, వారి విజయాలు మొదలైన విషయాలను ప్రజలతో పంచుకోవాలి. 
- వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వారు పడుతున్న కష్టాలు, విధాన నిర్ణయాలలో తప్పులు, అధికార పార్టీ అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు వంటివాటి పోస్టింగ్ లు పెట్టాలి, అలాంటి విషయాలపైనే ఫోకస్ చేయాలి. 


చేయకూడనివి..
బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై అనవసరంగా పోస్టింగ్ లు వద్దని చెప్పింది టీడీపీ అధిష్టానం. అదే సమయంలో సినీ నటులపై కూడా అనవసరంగా కామెంట్లు చేయొద్దని సూచించింది. ఇక జనసేన విషయంలో టీడీపీ సోషల్ మీడియా ద్వారా అవసరమైన మేరకే స్పందించాలని చెప్పింది. జనసేన, టీడీపీ అధికారికంగా కలిసి ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి కాబట్టి.. పొత్తు అధికారికంగా ఖరారైంది కాబట్టి ఎవరూ ఆ పొత్తుకి ఇబ్బంది కలిగేలా వ్యవహరించొద్దని సూచించారు నేతలు. పార్టీకి అవసరమైన విషయాలపై మాత్రమే స్పందించాలని, అవసరం లేనివాటిపై పోస్టింగ్ లు పెడితే.. అసలు ప్రజల్లోకి వెళ్లాల్సిన విషయాలు పక్కదారి పడుతున్నాయని చెబుతున్నారు నేతలు. 






పార్టీలో, పార్టీ అనుబంధ విభాగాలలో వివిధ పదవులలో, హోదాలలో ఉన్నవారు తమ బాధ్యతను గుర్తుంచుకోవాలని టీడీపీ అధిష్టానం చెప్పింది. పార్టీ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని, తమకు అప్పగించిన బాధ్యతను శ్రద్ధతో నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. టీడీపీ - జనసేన పొత్తు, అభ్యర్థుల ఎన్నిక, తదితర అంశాలను పూర్తిగా పార్టీ అధినాయకత్వానికి వదిలేసి, సోషల్ మీడియా ప్రచారంపై మాత్రమే ఫోకస్ పెట్టాలని సూచించింది. 


అలాంటి వారితో జాగ్రత్త.. 
జనసేన ముసుగులో లేదా ఏదైనా కులం ముసుగులో ఐప్యాక్ పేటీఎం అకౌంట్స్ నుంచి రెచ్చగొట్టేలా పోస్టులు వస్తుంటాయని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది టీడీపీ అధిష్టానం. అలాంటి పోస్ట్ లకు బదులు ఇవ్వకుండా, స్పందించకుండా వదిలేయాలని.. చివరకు వారే ప్రయత్నించి, ప్రయత్నించి ఆగిపోతారని చెప్పింది. టీడీపీకి మద్దతుగా పోస్ట్ లు పెడుతున్నవారు, ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నవారు.. దయచేసి వివాదాస్పద పోస్ట్ లకు 3 నెలలపాటు దూరంగా ఉండాలని అధిష్టానం చెబుతోంది. 2024 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ  మన ప్రధాన లక్ష్యం అని వివరించారు నేతలు.