ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సుదీర్ఘంగా ఏడాదిన్నర పాటు ప్రక్రియ సాగింది. ఓ వైపు అక్రమాలు, అరాచకాలు అని ప్రతిపక్షాలు పోరాడాయి. కోర్టులకు వెళ్లాయి. మధ్యలో కరోనా మహమ్మారి వచ్చి పడింది. ఈ కారణంగా ప్రక్రియ ముగిసే సరికి ఏడాదిన్నర అయింది. మిగతా వాటి సంగతేమో కానీ అందరి దృష్టి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై పడింది. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం కోటకు బీటలు కొట్టేశామని తమకు 70వేల మెజార్టీ వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు.
నాలుగు జడ్పీటీసీ స్థానాల్లోనూ వైసీపీ విజయం !
కుప్పం నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. నాలుగు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం ప్రకటించిన తర్వాత ఆ పార్టీ నేతలు పూర్తి స్థాయిలో సైలెంటయ్యారు. వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎంపీటీసీ స్థానాల్లో మాత్రం కొంతమంది నేతలు పోటీ పడ్డారు. అయినప్పటికీ బహిష్కరణ నిర్ణయం తీసుకునే సరికి టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో అభ్యర్థుల పేర్లు మాత్రం బ్యాలెట్లలో ఉన్నాయి. టీడీపీ ఓటర్లు కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం వరకూ నమోదైన పోలింగ్.. జడ్పీటీసీ ఎన్నికల్లో అరవై శాతానికి పడిపోయింది. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీలు సాధించారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా అక్కడ్నుంచి పోటీ చేయడం ప్రారంభించిన తర్వాత కుప్పం మండలంలో టీడీపీ ఎప్పుడూ ఓడిపోలేదు. ఈ సారి మాత్రంపరాజయం మూటగట్టుకుంది.
Also Read : అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం.. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ గతంలో సెల్ఫీ వీడియో
ఎంపీటీసీల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా !
కుప్పంలో మొత్తం 66 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 65 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో మూడు స్థానాల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. కుప్పం మండలంలో ఉన్న 19 ఎంపీటీసీల్లో వైఎస్ఆర్ సీపీ 17, టీడీపీ 2, గుడిపల్లె మండలంలో 12కి 12, రామకుప్పం మండలంలో 16కి గాను 16, శాంతిపురం మండలంలో 18కిగాను వైఎస్ఆర్‌సీపీ 11, టీడీపీ 6 ఎంపీటీసీలని గెలుచుకున్నాయి. నిజానికి టీడీపీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తర్వాత అనేక మంది అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధికార బలం ముందు పోరాడటం కష్టమని పార్టీ మారిపోయారు. అతి కొద్ది మంది మాత్రమే వ్యక్తిగతంగా పోరాడారు. నామినేషన్లు వేసినవారిని కూడా ప్రచారానికి దూరంగా ఉండాలని హైకమాండ్ ఆదేశించడంతో వెనక్కి తగ్గారు.
Also Read : ఏకపక్షంగా పరిషత్ ఎన్నికలు... అందుకే బహిష్కరించామన్న చంద్రబాబు.... పోలీసులపై లోకేశ్ ఫైర్
పోటీ చేసిన పంచాయతీల్లోనూ గడ్డు పరిస్థితే..!
బహిష్కరణ చేయని పంచాయతీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని ఎన్నికలు జరిగిన 89 గ్రామాల్లో కేవలం 14చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. 74 గ్రామాల్లో వైసీపీ మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు. అంటే మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హవా కనిపించింది.
Also Read : రూ.9వేల కోట్ల హెరాయిన్ వెనుక అసలు కథేంటి ? కింగ్ పిన్ ఎవరో ఎలా తేలుతుంది ?
పెద్దిరెడ్డి పంతం - పట్టించుకోని టీడీపీ హైకమాండ్
కుప్పంలో పట్టు సాధించాలని మంత్రి పెద్దిరెడ్డి పంతం పెట్టుకున్నారు. ఆయన స్థానిక ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన ప్రారంభించినప్పటి నుండి కుప్పంపైనే దృష్టి పెట్టారు. అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అన్న రీతిలో ఆయన టీడీపీ క్యాడర్‌ను కంట్రోల్ చేశారు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను సమన్వయం చేసే బృందం కూడా కనిపించలేదు. సీనియర్ నాయకులందరూ ఏవేవో కారణాలు చూపించి పక్కకు తప్పుకోవడంతో చాలాచోట్ల ఆర్థికంగా బలహీనులు, గ్రామాల్లో పెద్దగా బలంలేని వారు నిలబడ్డారు. ఫలితంగా పరాజయం పాలయ్యారు.
చంద్రబాబుకు ప్రమాద ఘంటికలే !
దశాబ్దాలుగా చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలోనూ వైఎస్సార్‌సీపీ క్రమంగా మెరుగుపడుతోందన్నది నిజం. 2014లో 50 వేలు ఉన్న చంద్రబాబు మెజారిటీని 2019లో 27 వేలకు తగ్గింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 43 వేల ఓట్లు రాగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 62,957 ఓట్లు వచ్చాయి. అంటే ఓటింగ్ తగ్గినా ఇరవై వేల ఓట్లు పెరిగాయి. మొత్తంగా చూస్తే తమకు అరవై వేల మెజార్టీ వచ్చిందని వైసీపీ వర్గాలు ప్రకటిస్తున్నాయి. చంద్రబాబుకు గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువే వచ్చాయని చెబుతున్నారు. ఎన్నికలు బహిష్కరించామని.. వైసీపీ అధికార దుర్వినియోగానికి భయపడిందని మరొకటని కారణాలు చెబితే... తర్వాత కూడా ఓటమికి కారణాలు చెప్పుకోవాల్సిందేనన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.
Also Read : ప్రభుత్వ ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌కు టాలీవుడ్ ఓకే ! పేర్ని నానితో భేటీలో కీలక నిర్ణయాలు