తిరుమలలో భక్తులు పోటెత్తారు. సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వేలాది మంది శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే శ్రీనివాసం వద్ద ఫుట్‌పాత్‌పై భక్తులు బారులుతీరారు. తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభమైంది. ఆధార్ కార్డు ఆధారంగా అన్ని ప్రాంతాల వారికి టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. సర్వదర్శనం టికెట్ల ఆన్‌‌లైన్‌ ద్వారా విడుదల చేసేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను చేసింది. టికెట్ల జారీ కోసం తితిదే వెబ్‌సైట్‌లో ప్రత్యేక పోర్టల్‌ను తీసుకొచ్చింది. కరెంట్‌ బుకింగ్‌ ద్వారానే ఇప్పటివరకు ఉచిత టోకెన్లను విడుదల చేసింది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో భక్తులు గుమికూడే పరిస్థితి రానివ్వకుండా ఉండేందుకు ఆన్​‌లైన్‌ విధానాన్ని తీసుకువస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. త్వరలో ఆన్‌లైన్‌ ద్వారా టికెట్ల జారీ ప్రక్రియ మొదలు పెడతామని, దీనికి సంబంధించి సాంకేతికంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.


రోజుకు 8 వేల టోకెన్ల జారీ 
కోవిడ్ తీవ్రత కారణంగా ఏడాదిన్నర కాలంగా శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను టీటీడీ నిలిపివేసింది. కోవిడ్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబరు 8 నుంచి టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఇది కేవలం చిత్తూరు జిల్లాకు చెందిన ప్రజలకు మాత్రమే ప్రయోగాత్మకంగా నిర్వహించింది. తిరుపతిలోని శ్రీనివాసం వసతి సముదాయం వద్ద టోకెన్లు జారీచేస్తున్నట్లు వెల్లడించింది. ఇక ఇటీవల సర్వదర్శనం టోకెట్లను ఇతర ప్రాంతాల వారికి సైతం జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచుతూ ఇటీవల కీలక ప్రకటన విడుదల చేసింది. రోజుకు 8 వేల టోకెన్లను జారీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది. సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంపుతో పాటుగా దర్శన సమయాన్ని కూడా పెంచినట్లు పేర్కొంది. 


కోవిడ్ నిబంధనలు తప్పనిసరి.. 
కోవిడ్ అనంతరం తిరుమలలో పరిస్థితులు మారాయి. ప్రతి భక్తుడు కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు భౌతిక దూరం పాటించడంతో, మాస్కులు ధరించాలని తెలిపింది. శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తోంది. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో టీటీడీ పరిమిత సంఖ్యలో భక్తులను కొండపైకి అనుమతించింది. ఇక సెకండ్ వేవ్ తీవ్రమవుతోన్న నేపథ్యంలో సర్వదర్శనాల్ని పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించింది. ప్రత్యేక దర్శనం ద్వారా (రూ.300 టికెట్‌) పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తోంది. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గడం.. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తోంది. 


శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు.. 
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ‌ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉమాదేవి.. అపోలో పౌండేషన్, అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెలలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.