Tdp Second List : టీడీపీ రెండో జాబితాలో సీనియర్లకు షాక్ తగిలింది. 34 మందితో విడుదలైన రెండో జాబితాలో పలువురు సీనియర్లకు సీటు దక్కలేదు. సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, కళావెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా, కేఎస్ జవహర్ తో పాటు పలువురు సీనియర్ల పేర్లు రెండో జాబితాలో లేవు. వీరి పోటీపైన గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులు, సెకండ్ లిస్టులో 34మంది టికెట్లు కేటాయించింది టీడీపీ.
గంటా శ్రీనివాసరావును చీపురుపల్లీలో పోటీ చేయాలని చంద్రబాబు కోరుతున్నారు. అయితే అక్కడ పోటీ చేయడంపై గంటా వెనుకడుగు వేస్తున్నారు. తనకు భీమిలి నియోజకవర్గం కావాలంటున్నారు. ఈ సీటుపై ఎటూ తేలకపోవడంతో పెండింగ్ లో పెట్టారు. మాడుగులలో గవిరెడ్డి రామానాయుడుకు, పివిజి కుమార్ కు నిరాశే ఎదురైంది. అక్కడ పైలా ప్రసాద్ కు చాన్సిచ్చారు. వైసీపీకి రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంకు సత్యవేడు టికెట్ ఇచ్చింది టీడీపీ. విజయవాడ వెస్ట్ లో జలీల్ ఖాన్ కు టికెట్ దక్కలేదు. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టికెట్ దక్కించుకున్నారు.
రెండో జాబితాల్లోనూ తమకు కచ్చితంగా టికెట్ దక్కుతుందని సీనియర్లు భావించారు. అయితే, వారికి సెకండ్ లిస్టులోనూ నిరాశే ఎదురైంది. మూడో జాబితాలో అయినా తమకు టికెట్ వచ్చే అవకాశం ఉందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా 14 సీట్లను పెండింగ్ లో పెట్టింది. రెండో జాబితాలో ఏడుగురు మహిళలకు చోటు కల్పించింది టీడీపీ. 35ఏళ్ల లోపు వారిలో ఇద్దరు, 75ఏళ్లు పైబడిన వారిలో ఇద్దరు లిస్టులో ఉన్నారు. టీడీపీ సెకండ్ లిస్ట్ లో పీహెచ్ డీ చేసిన వారు ఒకరు, పీజీ చదువుకున్న వారు 11మంది, 10లోపు చదువుకున్న వారు ఐదుగురు ఉన్నారు. ఇక పొత్తులో భాగంగా గాజువాక టికెట్ టీడీపీకే దక్కింది. గాజువాక సీటును టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ కు కేటాయించారు. మరోవైపు రెండో జాబితాలోనూ ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేతల పేర్లు కనిపించలేదు.
గెలుపే ప్రామాణికంగా, సర్వేలు, ప్రజాభిప్రాయసేకరణ, పార్టీ పరంగా అంతర్గతంగా జరిగిన అనేక సర్వేల ఆధారంగానే రెండు జాబితాల్లోనూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొనసాగించింది టీడీపీ. రెండు జాబితాల్లోనూ టికెట్ దక్కక తీవ్ర నిరాశలో ఉన్న వ్యక్తుల్లో గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేఎస్ జవహర్ ప్రధానంగా ఉన్నారు. ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు కూడా టిక్కెట్ ఖారరు చేయలేదు.