Devineni Uma : మాజీ మంత్రి, సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు షాక్‌ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. మైలవరం సీటు ఉమ ప్రత్యిర్థిగా ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే.. ఈ మధ్యే వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించింది. ఈ కారణంగా దేవినేని ఉమకు సీటు లేనట్లేనని స్పష్టమయింది.  వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన దేవినేని ఉమ.. నాలుగు సార్లు గెలిచి మంత్రిగా పనిచేశారు.. కానీ, గత ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్‌ చేతిలో ఓటమి పాలయ్యారు..                                              


 వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీ గూటికి చేరడం.. ఈ సారి టికెట్‌ ఆయనకే దక్కుతుందనే ప్రచారం సాగుతోన్న తరుణంలో.. మైలవరం కాకపోయినా.. పెనమలూరు టికెట్ వస్తుంద  దేవినేని ఉమ వర్గం భావించింది.   కానీ, నాకు సీటు ఇవ్వా్ల్సిందే.. లేదంటే.. చంద్రబాబు ఫొటో పెట్టుకుని ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానంటూ భీష్మించుకు కూర్చున్నారు మాజీ మంత్రి బోడే ప్రసాద్.. దీంతో.. చివరకు పెనమలూరు టికెట్‌ను బోడే ప్రసాద్‌కే కట్టబెట్టింది టీడీపీ అధిష్టానం.. ఇక, మైలవరం చేజారిపోవడమే కాదు.. ఆశించిన పెనమలూరు టికెట్‌ కూడా దేనినేని ఉమామహేశ్వరరావుకు రాకుండా పోయింది.  


తాజా జాబితాలో మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ కు చోటు లభిచింది.  11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను టీడీపీ (TDP) ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుంచి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ (MLA Vasantha Krishna Prasad) టికెట్ దక్కించుకున్నారు. ఇటీవలే ఆయన వైఎస్సార్‌సీపీ (YSRCP) నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ మైలవరం టికెట్ దక్కించుకున్నసందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి (Chandrababu)కి ధన్యవాదాలు తెలిపారు. ‘‘నాపై నమ్మకం ఉంచి మైలవరం నియోజకవర్గ అసెంబ్లీ సీటు కేటాయించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగిరెలా నియోజకవర్గంలోని ప్రతిఒక్క నాయకుడిని, కార్యకర్తలను సమన్వయపరుస్తూ నా ప్రయాణం కొనసాగిస్తా’’ అని వసంత కృష్ణ ప్రసాద్ ట్విటర్ (Twitter) వేదికగా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.                            


 వసంత టీడీపీలో చేరే సమయంలో కూడా మైలవరం టికెట్ ఎవరికి కేటాయించినా తాను సహకరిస్తానన్నారు. కానీ అనూహ్యంగా మైలవరం టికెట్ వసంతకే దక్కింది. వసంతకు టికెట్ కేటాయించడంపై మైలవరంలో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. వసంత పేరు ప్రకటించడంతో మైలవరం ప్రధాన రహదారి పై, పార్టీ కార్యాలయం వద్ద నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. వసంత నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు.