తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి  ( Bojjala Gopala Krishna Reddy )

  తుది శ్వాస విడిచారు. కొంత కాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయనకు అనారోగ్యం తీవ్రం కావడంతో పూర్తిగా మంచానికే పరిమితయ్యారు. ఆయన పరిస్థితి విషమించడంతో వారం క్రితం అపోలో ఆస్పత్రిలో ( Appllo Hospital ) చేర్పించారు. చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయినట్లుగా వైద్యులు నిర్దారించారు. 


బొజ్జల గోపాలకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు మిత్రుడు. చంద్రబాబుపై అలిపిరిలో నక్సలైట్లు జరిపిన దాడిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా గాయపడ్డారు. ఆ గాయాలకు ఆయన చాలా కాలం పాటు చికిత్స తీసుకున్నారు. పలు ఆపరేషన్లు కూడా చేయించుకోవాల్సి వచ్చింది. గత నెలలో బొజ్జల పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు ఇతర  సన్నిహితులతో ఆయన ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించారు. 



అలిపిరి దాడిలో తీవ్రగాాయాలు అయినా  రాజకీయంగా ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు. 1989లో తొలి సారి ఎమ్మెల్యే అయిన ఆయన ఆ తర్వాత శ్రీకాళహస్తి ( Sri KalaHasti ) ప్రజల ఆదరాభిమానాలు పొందారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలి మంత్రివర్గంలో ఆయన ఆటవి శాఖ మంత్రిగా పని చేశారు. అయితే అనారోగ్యం కారణంగా చివరిలో ఆయనకు విశ్రాంతినిచ్చారు చంద్రబాబు. గత ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి బొజ్జలకు బదులుగా ఆయన తనయుడు సుధీర్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  


ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశంలో ఉన్న సమయంలో  ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్,  మండవ వెంకటేశ్వరరావు,  బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆత్మీయ మిత్రులుగా ఉండేవారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా పలు సందర్భాలలో కేసీఆర్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మధ్య ఆత్మీయ సమావేశాలు జరిగాయి.  బొజ్జల అనారోగ్యంతో ఉన్నారని  తెలిసిన తర్వాత కేసీఆర్ కూడా హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్సించారు. 


బొజ్జల మృతితో శ్రీకాళహస్తిలో విషాథ చాయలు అలుముకున్నాయి.  నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంతోనూ ఆయనకు అనుబంధం ఉంది. ప్రతి గ్రామంలోనూ ఆయన చేసిన అభివృద్ధి కనిపిస్తుందని టీడీపీ నేతలు చెబుతూ ఉంటారు. కాళహస్తి నియోజకవర్గం గొప్ప నాయకుడ్ని కోల్పోయిందని టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  


చంద్రబాబు దిగ్భ్రాంతి 


 తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం అత్యంత బాధాకరమని చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.   లాయర్ గా జీవితాన్ని ప్రారంభించి.. ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి శ్రీకాళహస్తి నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పని చేసిన సీనియర్ నాయకుడి అకాల మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు.   అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించేవారని గుర్తు చేసుకున్నారు.  బొజ్జల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. బొజ్జల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు..