TDP On Jr NTR : చంద్రబాబునాయుడు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం చర్చనీయాంశమయింది. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయననే అడగాలని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. స్పందించాలని తాము ఎవరినీ అడగడం లేదన్నారు. తనను అడిగితే తాను ఏం చెపుతానని అన్నారు. జనసేనతో రాబోయే రోజుల్లో జనసేనతో కలిసి కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ ను జనసేన నేతలు, కార్యకర్తలు ఖండిస్తున్నారని చెప్పారు. టీడీపీ చేపట్టిన దీక్షల్లో జనసేన శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయని తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై గుసగుసలు
చంద్రబాబును అరెస్టు చేయడంపై అందరూ స్పందిస్తున్నారు కానీ.. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం చర్చనీయాంశమయింది. ఇది రాజకీయంగా మద్దతు ప్రకటించడం కాదని.. కష్టకాలంలో కుటుంబసభ్యునికి అండగా నిలవడం అని.. చాలా మంది విశ్లేషిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత ఓ అవార్డు ఫంక్షన్ కు ఆయన దుబాయ్ వెళ్లారు. సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ , టీడీపీ ఫ్యాన్స్ మధ్య తరచూ ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఎన్టీఆర్ చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నరని అలాంటి ప్రకటనలు కూడా చేయలేదంటున్నారు.
టీడీపీ అగ్రనాయకత్వంతో వివాదాలు ఉన్నాయని ప్రచారం
జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అయితే ఆ తర్వాత వైసీపీలో పెద్దగా ఎక్కడా కనిపించలేదు. కానీ అంతకు ముందు నుంచే టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కలిసినప్పుడల్లా ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటున్న దృశ్యాలు వెలుగులోకి వస్తూంటాయి. అయితే రాజకీయ పరమైన సందర్భాల్లో అందరూ స్పందిస్తున్నా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మాత్రం స్పందించడం లేదు. ఇది టీడీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణల విషయంలో ఎన్టీఆర్ అంత సానుకూలంగా లేరని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మౌనాన్ని వైఎస్ఆర్‌సీపీకి చెందిన కొంత మంది నేతలు.. టీడీపీపై ఎదురుదాడికి ఉపయోగించుకుంటున్నారు.
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ
ఆర్ఆర్ఆర్ విజయం తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ ఓ సారి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏం చర్చించారో ఎవరికీ తెలియదు కానీ.. ఆయన మాత్రం ఎలాంటి ప్రకటనలు చేయలేదు. బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. అన్ని రాజకీయ అంశాలకూ జూనియర్ ఎన్టీఆర్ దూరంగానే ఉంటున్నారు.