మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వేసుకున్న బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు రెండు పిటిషన్లు వేశారు. బెయిల్, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టులో అభ్యర్థన పెట్టుకున్నారు. 


ఈ రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు.. వాదనలను 19వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన టైంలో చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ అంశాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. ఇప్పుడు మధ్యంతర బెయిల్ వస్తే క్వాష్ పిటిషన్‌పై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. 


స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తనపై ఎలాంటి ఆరోపణలు లేకపోయినా కేసు నమోదు చేసి జైల్లో పెట్టారని బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ వేశారు. కనీసం ఎప్‌ఐఆర్‌లో కూడా తన పేరు లేదని కోర్టుకు తెలియజేశారు. ఏపీఎస్‌డీసీ ఛైర్మన్‌ ఇచ్చిన ఫిర్యాదులో కూడా తన పేరు లేదని గుర్తు చేశారు. రాజకీయంగా ప్రతికారం తీర్చుకోవడానికే ఈ కేసులో ఇరికించారని దీన్ని పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని రిక్వస్ట్ పెట్టుకున్నారు.