TDP MP Kanakamedala Ravindra Kumar announced that three parties will contest together in AP : బీజేపీతో పొత్తులు కుదిరాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రకటించారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు. అన్ని పార్టీలు బలాబలాలను బట్టి పోటీ చేస్తాయన్నారు. సీట్ల సంఖ్యపై అధికారిక ప్రకటన కాసేపట్లో వస్తుందన్నారు. పొత్తుల వల్ల కొంత మంది సీట్లు కోల్పోతున్నందు వల్ల నేతల్లో అసంతృప్తి పెరుగుతన్నా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి ముందుకు వెళ్తున్నామన్నారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే మూడు పార్టీలో లక్ష్యం అన్నారు.
ఉదయం పదకొండు గంటల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షాతో సమావేశం అయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు ఏపీ రాజకీయాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చ కొనసాగింది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య అవగాహన కుదిరిన తర్వాత అలాగే ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించింది.. ఈ నెల 14వ తేదిన జరిగే ఎన్డీఎ సమావేశానికి చంద్రబాబును హాజరుకావాల్సిందిగా అమిత్ షా కోరారు.
నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ లోకి టీడీపీ చేరిక ప్రకటన ఏ క్షణమైనా రానుంది. రెండు విడతలుగా ఢిల్లీలో జరిగిన చర్చల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చింది. టీడీపీ పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో , బీజేపీ ఆరు స్థానాల్లో, జనసేన రెండు లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనున్నారు. జనసేన రెండు స్థానాలు కాకినాడ, మచిలీపట్నంగా ఖరారయ్యాయి. రాజంపేట, ఏలూరు, అనకాపల్లి, రాజమండ్రి, అరకు, హిందూపురం నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయనుంది. మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థులు బరిలో ఉంటారు. ఇక అసెంబ్లీ స్థానాల్లోనూ లెక్క కుదిరింది. బీజేపీ, జనసేనకు కలిసి 30 నియోజకవర్గాలు కేటాయించారు. ఇందులో ఇరవై నాలుగు జనసేన, ఆరు బీజేపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఆ ఆరు నియోజకవర్గాలు ఏమిటేమిటి అన్నదానిపై రాష్ట్ర స్థాయిలో చర్చించి ఖరారు చేసుకుంటారు.
బీజేపీ పెద్దలతో చర్చల తర్వాత పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడు అమరావతి బయలుదేరి వెళ్లినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల్లో వారు పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. పొత్తుల్లో పోటీ చేయాల్సిన స్థానాలపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వా.. మిగిలిన చోట్ల అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పిటకే అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే.. బీజేపీతో పొత్తుల కారణంగానే వాటిని పెండింగ్ లో పెట్టారు. స్థానాలు ఖరారైన తర్వాత ... అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.. మరో మూడు, నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.