TDP MP Kalishetty Appalanaidu donated his first salary to Amaravati :   తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గెలిచిన ఎంపీలతో సమావేశం అయ్యారు. తర్వాత ఎంపీలందరూ ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది.  ఆ సమయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును చంద్రబాబు వాకబు చేశారు. ఢిల్లీకి వెళ్లడానికి ఫ్లైట్ టిక్కెట్ తీసుకున్నారా లేకపోతే.. పార్టీ ఆరెంజ్ చేయమని చెప్పనా అని అడిగారు. దీనికి కారణం అప్పలనాయుడు ఆర్థిక పరిస్థితి చంద్రబాబుకు తెలియడమే. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అప్పలనాయుడు టీడీపీలో సుదీర్ఘకాలంగా  పని చేశారు. ఆయన ఎచ్చెర్ల నుంచి టిక్కెట్ ఆశించారు. కనీ ఆ స్థానం బీజేపీకి వెళ్లడంతో విజయనగరం లోక్ సభ సీటును కేటాయంచారు. ఆయన అక్కడ విజయం సాధించారు. 


అయన ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి చంద్రబాబు గుర్తుంచుకుని మరీ ఆయన అవసరాలు తీర్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ ఎంపీ తన తొలి జీతాన్ని అమరావతి అభివృద్ధికి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు లక్షా యాభై ఏడు వేల రూపాయల చెక్కును చంద్రబాబుకు స్వయంగా ఇచ్చారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అప్పలనాయుడుకు తొలి జీతంతో వ్యక్తిగత ఆర్థిక సమస్యలు కొంత వరకూ తీరే అవకాశం ఉండేది. కానీ ఆయన అలా అనుకోలేదు.  రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం తన తొలి జీతాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 


ఇటీవల తిరుమలలో  శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సమయంలో తన  తొలి జీతం అమరావతికి విరాళంగా ఇస్తానని మొక్కుకున్నానని అప్పలనాయుడు తెలిపారు.  తాను తీసుకున్న నిర్ణయం ప్రకారం …. ఈనెల 4న అందిన తన తొలి నెల గౌరవ వేతనం రూ.1.57 లక్షల చెక్‌ ను   చంద్రబాబుకి అందజేశానని మీడియాకు తెలపారు.  ఎవరైనా తొలిసారిగా అందిన జీతం మొత్తాన్ని తల్లిదండ్రుల చేతుల్లో పెట్టడం సంప్రదాయమని.. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌ కు, తనకు తండ్రి సమానులుగా ఉన్న చంద్రబాబు నాయుడుకి తన తొలి నెల గౌరవ వేతనం  చెక్కును .. అమరావతి అభివృద్ధి కోసం అందజేశానన్నారు. ఇది తనకి ఎంతో ఆనందాన్నిచ్చిందని ఎంపీ వ్యాఖ్యానించారు.                                     


అమరావతిని మళ్లీ పట్టాలెక్కించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు విరాళాలు ప్రకటిస్తున్నారు.. రామోజీ గ్రూపు సంస్థల తరపున రూ. పది కోట్లను అమరావతికి విరాళంగా ప్రకటించారు. రామోజీ సంస్మరణ సభలో చెక్కును  చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు రామోజీ కుమారుడు కిరణ్ అందించారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులు కూడా తమ తొలి నెల జీతాన్ని విరాళంగా ఇవ్వడం ప్రారంభించారు.