TDP MLC Anuradha: మూడు రాజధానులంటే మూడు చోట్ల కాపురం పెట్టడమా అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అనురాధ వ్యాఖ్యానించారు. ఏపీకి మూడు రాజధానులు అన్నారని, త్వరలో తాను విశాఖలో కాపురం పెడతానని చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్ పై టీడీపీ కామెంట్స్...
శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ లో విశాఖ వచ్చి కాపురం ఉంటానని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో కాపురం పెట్టాలని మొన్న తాడేపల్లి ప్యాలెస్ వచ్చిన సందర్భంగా పొలిటికల్ లాబీయిస్ట్ విజయ్ కుమార్ చెప్పారా అని ఆమె ప్రశ్నించారు. లేదంటే విశాఖ శారదా పీఠం స్వరూపానంద ముహూర్తం పెట్టారా అని అనురాధ ఎద్దేవా చేశారు. రాయలసీమలో కాపురం పెట్టి ఇడుపులడలపాయలో అసైన్డ్ భూములు కొట్టేశారని, అమరావతిలో కాపురం పెట్టి రాజధాని రైతులను రోడ్డున పడేశారని వ్యాఖ్యానించారు. అమరావతిని పూర్తిగా నాశనం చేసి, భూములిచ్చిన రైతులను క్షోభ పెట్టారని, విశాఖ వెళ్లక ముందే ఎంపీ విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిని అక్కడికి పంపి 40 వేల కోట్ల విలువైన భూములు కబ్జా చేసేశారని ఆరోపించారు. ఋషికొండను బోడిగుండు చేసేసి రేపు సెప్టెంబర్ లో అక్కడ కాపురానికి వెళతారా అని జగన్ ను నిలదీశారు.
మూడు చోట్ల కాపురం పెట్టటమా...
వికేంద్రీకరణ అంటే మూడుచోట్ల కాపురం పెట్టడమా అని ఎమ్మెల్సీ అనురాధ సీఎం జగన్ ను ప్రశ్నించారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసం, కబ్జాలు మినహా ఏం లేదని ఎద్దేవా చేశారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని జగన్ తన నోటి వెంటే చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. ఒకవేళ జగన్ చెప్పకపోయినా ప్రజలే చెప్పిస్తారన్నారు.
హత్యకు ఎన్నో అబద్దాలు..
ఒక హత్య- లక్ష అబద్ధాలతో కాలం గడపడం మినహా ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి జగన్ రెడ్డి చేసిందేంటని అనురాధ ప్రశ్నించారు. వివేకా హత్య కేసు వెబ్ సిరీస్ ను తలపిస్తోందని, నెట్ ఫ్లెక్స్, జీ 5, ప్రైమ్ కూడా వీరి ముందు దిగదుడుపేనని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో జగన్ అండ్ కో నటన ఆస్కార్ ను మించిపోయిందన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో అన్ని వేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని, ముందు గుండెపోటని, ఆ తర్వాత గొడ్డలిపోటు అన్నారని గుర్తు చేశారు. గొడ్డలి టీడీపీదని, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి హస్తం ఉందని ఆరోపించి, నారాసుర రక్తచరిత్ర పేరుతో పుస్తకాలు వేసిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో బయటకు రావాలన్నారు. విపక్షంలో సీబీఐ విచారణ కావాలన్న జగన్ అధికారంలోకి రాగానే సీబీఐ విచారణ అవసరం లేదనటంపై ప్రశ్నించారు. వివేకా హత్యలో ఆయన కూతురు సునీత హస్తం ఉందని, వివేకా రెండో భార్యే హత్య చేయించిందని, సునీల్ యాదవ్ తల్లికి, వివేకాకు సంబంధం ఉందని రకరాలుగా ప్రచారాలు చేయటం దారుణం అన్నారు. వివేకా హత్య జరిగినప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి జమ్మలమడుగులో ఉన్నారని, వివేకానంద రెడ్డి విగ్రహ ఆవిష్కరణలో ఆయన్ను పొగిడి, ఇప్పుడేమో ఆయన్ను దుమ్మెత్తిపోస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఒక కన్ను మరో కన్నును పొడుచుకుంటుందా అంటూ అసెంబ్లీలో నంగనాచి కబుర్లు చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు ఎందుకు భయపడున్నారని అన్నారు. హత్య కేసులో అన్ని వేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని, జగన్ రెడ్డి అనుమతి లేకుండా హత్య సాధ్యమా అని పేర్కొన్నారు. పిన్నమ్మ తాళి తెంచిన జగన్ రెడ్డి ఏపీ ప్రజలకు న్యాయం చేస్తారా... చెల్లి భర్త పై హత్యానేరం మోపిన జగన్ రెడ్డి ప్రజలకు రక్షణ కల్పిస్తారా అని ప్రశ్నించారు. కుటుంబసభ్యులనే దారుణంగా మోసం చేసిన జగన్ రెడ్డి పాలనలో సామాన్యుల పరిస్థితేంటన్నారు. హత్య చేయలేదని చెబుతున్న అవినాష్ రెడ్డి ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఎందుకు తుడిచినట్టో చెప్పాలన్నారు. సునీతకు న్యాయం జరుగుతుందని, కోర్టులు న్యాయం చేస్తాయని నమ్ముతున్నామని అనురాధ అన్నారు.
3 రాజధానులంటే మూడు చోట్ల కాపురం పెట్టడమా? - సీఎం జగన్ పై ఎమ్మెల్సీ అనురాధ సెటైర్!
ABP Desam
Updated at:
19 Apr 2023 10:38 PM (IST)
TDP MLC Anuradha: మూడు రాజధానులంటే మూడు చోట్ల కాపురం పెట్టడమా అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అనురాధ వ్యాఖ్యానించారు.
జగన్ పై ఎమ్మెల్సీ అనురాధ విమర్శలు
NEXT
PREV
Published at:
19 Apr 2023 10:38 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -