దసరా నాటికి వరంగల్ హెల్త్ సిటీ పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి హరీష్ రావు. పనులు వేగంగా పూర్తి చేయాలని R&B అధికారులకు సూచించారు. 3 టిమ్స్ ఆసుపత్రుల పనులు వేగవంతం చేయాలని, 8 టీచింగ్ ఆసుపత్రుల పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ ఏడాది ప్రారంభమయ్యే 9 మెడికల్ కాలేజీల డిజైన్లు రూపొందించాలని రోడ్లు భవనాల శాఖ అధికారులకు మంత్రి హరీష్ రావు అదేశాలు జారీ చేశారు.
3 టిమ్స్ ఆసుపత్రుల పనులు స్పీడప్ చేయాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. దసరా నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారుర. గ్రేటర్ పరిధితో పాటు, నగర శివారు ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న సనత్ నగర్ , LB నగర్, అల్వాల్ TIMS సుపత్రుల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. వరంగల్ హెల్త్ సిటీ, TIMS ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల పనులు పురోగతి, ఇతర అంశాలపై మంత్రి హరీశ్ రావు MCR HRDలో సమీక్ష నిర్వహించారు.
9 మెడికల్ కాలేజీల డిజైన్లు రూపొందించాలి
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే దిశగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విప్లవాత్మమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇందులో భాగంగా ఒక వైపు వైద్యం, మరోవైపు వైద్య విద్యను విస్తృతం చేస్తున్నట్లు చెప్పారు. వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తయితే ఆ ప్రాంతం మెడికల్ హబ్‌గా మారుతుందన్నారు. ఇందులో అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చుతున్నట్లు చెప్పారు. మాడ్రన్ మాడ్యులర్ థియేటర్లు, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశమే లేకుండా ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో TIMS సేవలు ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని మంత్రి అన్నారు. ఒక్కొక్కటి 1000 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. 8 టీచింగ్ ఆసుపత్రుల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది ప్రారంభం కానున్న 9 మెడికల్ కాలేజీల డిజైన్లు రూపొందించాలని చెప్పారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ నిర్మాణాలకు సంబంధించి వైద్యారోగ్య శాఖ తరుపున అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేసినట్లు తెలిపారు. కాబట్టి R&B అధికారులు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని సూచించారు.
వరంగల్ హెల్త్ సిటీ ప్రత్యేకతలు ఇవే:
వరంగల్ హెల్త్ సిటీ బిల్డింగుని చారిత్రాత్మక భవనంగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రానికే కాదు దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు ఇక్కడ అందబోతున్నామని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. మొత్తం 216 ఎకరాల్లో వరంగల్ హెల్త్ సిటీ రూపుదిద్దుకుంటోంది. అవయవమార్పిడి ఆపరేషన్లు కూడా ఇక్కడ అందుబాటులోకి రాబోతున్నాయి. రూ.1100 కోట్లతో ఆర్‌అండ్‌బీ పర్యవేక్షణలో ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానం ద్వారా ఎల్‌అండ్‌టీ సంస్థ హాస్పిటల్ నిర్మాణ పనులు చేపట్టింది. 16.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 అంతస్తుల్లో అతిపెద్ద హాస్పిటల్ నిర్మాణమవుతున్నది. అందులో 14.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 35 రకాల వైద్య, పారా మెడికల్ సేవలు ఉంటాయి. తలసీమియా బాధితులకు ప్రత్యేక విభాగం ఉంటుంది.