TDP Membership Registration | అమరావతి: ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ, జనసేన దూకుడు పెంచాయి. తిరుమల లడ్డూ వివాదం ముగిసిన తరువాత ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. టీడీపీ సభ్యత్వ నమోదుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పార్టీ సీనియర్ నేతలతో ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు సమావేశమై చర్చించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై సైతం చర్చించినట్లు తెలుస్తోంది. 


ఏపీలో శనివారం (అక్టోబర్ 26) నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టనున్నారు. కేవలం రూ.100తో పార్టీలో సభ్యత్వం నమోదు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ సభ్యత్వంతో కార్యకార్తలకు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా కల్పించనున్నారు. ఆ కార్యకర్తల ఫ్యామిలీకి వైద్య, విద్య, ఉపాధి కోసం ఈ ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.


ఇదివరకే తొలి దఫా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయగా.. రెండో దఫా నామినేటెడ్ పదవుల భర్తీపై సీనియర్ నేతలతో దాదాపు 3 గంటలపాటు సీఎం చంద్రబాబు చర్చించారు. వీలైనంత త్వరగా నామినేటెడ్ పోస్టుల రెండో లిస్ట్ విడుదల చేస్తామని, అందుకు కసరత్తు జరుగుతోందన్నారు. తొలి దశలో 21 నామినేటెడ్ పదవులు ఇవ్వగా, రెండో జాబితాలో రెట్టింపు పోస్టులు భర్తీ చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీపై కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ అధ్యక్షులతో చంద్రబాబు చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారికి కచ్చితంగా తగిన గౌరవం లభిస్తుందని చంద్రబాబు పార్టీ నేతలకు హామీ ఇచ్చారు.