TDP Members Walkout From AP Assembly: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అబద్ధాలు వినలేకపోతున్నామంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభను బహిష్కరించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా పలు అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తారు. జగనన్న విద్యా దీవెన కింద పూర్తి రీయింబర్స్ మెంట్ ఇచ్చామని గవర్నర్ తెలపగా.. అంతా అబద్ధం అంటూ నినాదాలు చేశారు. 'మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ' అని, రైతులను ప్రభుత్వం మోసం చేసిందని, అంగన్వాడీలకు అన్యాయం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అసెంబ్లీని బహిష్కరించిన టీడీపీ సభ్యులు అసెంబ్లీ లాబీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్ వెళ్లే దారిలో బైఠాయించే ప్రయత్నం చేయగా.. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. దీనిపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోటా పోటీ నినాదాలు
అసెంబ్లీలో పోటాపోటీ నినాదాలతో గందరగోళం తలెత్తింది. టీడీపీ సభ్యులు 'బై బై జగన్' అంటూ నినాదాలు చేయగా.. వారికి పోటీగా వైసీపీ సభ్యులు 'జై జై జగన్' అంటూ నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. పేదలందరికీ రూ.10 ఇచ్చి రూ.100 లాక్కుంటున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. దిశ చట్టం ఎక్కడా అంటూ కేకలు వేశారు. 'రైతు భరోసా కేంద్రాలు ఎక్కడ.?. ఇన్ పుట్ సబ్సిడీ రైతులను కాదని.. వైసీపీ నేతలకు ఇచ్చారు. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, అంగన్వాడీలకు జీతాల పెంపు ఏదీ?' అంటూ నినదించారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ సభ నుంచి వాకౌట్ చేశారు.
బాలకృష్ణ ఆగ్రహం
అంతకు ముందు అసెంబ్లీకి వెళ్లే సమయంలో టీడీపీ సభ్యులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అసెంబ్లీకి వెళ్లే సభ్యులను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిది.? అని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. సచివాలయ అగ్నిమాపక కేంద్రం వద్ద 'బై బై జగన్' అంటూ ఫ్లకార్డులు పట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి వారిని అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. 'వైసీపీ ప్రభుత్వ అని అయిపోయింది. తమను చూసి సీఎం జగన్ భయపడుతున్నారు. అసెంబ్లీకి వచ్చే నేతలను అడ్డుకునే కొత్త సంప్రదాయానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.' అంటూ బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బారికేడ్లను తోసుకుంటూ కాలినడకన అసెంబ్లీకి వచ్చారు.
అచ్చెన్నాయాడు విమర్శలు
అంతకు ముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడారు. 'ఒక స్థానానికి ఉదయం ఒకరిని, రాత్రికి మరొకరిని మార్చే పార్టీలు తెలుగుదేశం, జనసేన కావు. చివరి అసెంబ్లీ సమావేశాల్లోనైనా సీఎం జగన్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. జగన్ ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు.' అంటూ మండిపడ్డారు.
Also Read: AP Assembly: 'జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం' - అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం