Nellore Court Case: నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్ల గల్లంతు కేసు కీలక మలుపు తిరిగింది. ఇందులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రమేయం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు విజయవాడలోని ఐదో అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో సీబీఐ ఛార్జ్‌షీట్ వేసింది. పోలీసులు అరెస్టు చేసిన సయ్యద్ హయత్, షేక్ ఖాజానే ఈ నేరానికి పాల్పడినట్టు నిర్దారించింది.
రెండేళ్ల క్రితం చోరీ
2022 ఏప్రిల్ 13న నెల్లూరు కోర్టులో దొంగతనం జరగడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. నాల్గో అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో రాత్రి కొందరు దుండగులు చోరీ చేశారు. ఎలక్ట్రానిక్ వస్తువులు పలు పత్రాలు ఎత్తుకెళ్లిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన నెల్లూరు జిల్లా పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. వారి నుంచి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇదంతా మంత్రిగా ఉన్న కాకాణి గోవర్దన్ రెడ్డి చేయించారని ఆయన్ని తప్పించి దర్యాప్తును పక్కదారి పట్టించారని టీడీపీ ఆరోపించింది. దీనిపై ఇరు పార్టీల మధ్య ముఖ్యంగా గోవర్దన్ రెడ్డి, సోమిరెడ్డి మధ్య హోరాహోరీ ఫైట్ నడిచింది. ఇద్దరూ మాటా మాటా అనుకున్నారు. ఇంతలో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రి కాకాణి సవాల్ చేశారు. అదే టైంలో కోర్టులో కూడా సీబీఐ దర్యాప్తునకు రిక్వస్ట్ పెట్టుకున్నారు.
అందర్నీ విచారించిన సీబీఐ
కోర్టు వెంటనే సీబీఐ దర్యాప్తునకు అప్పగించింది. రెండేళ్లపాటు విచారించింది. 88 మంది సాక్షులను ప్రశ్నించింది. 403 పేజీల ఛార్జ్‌షీట్ న్యాయస్థానానికి సమర్పించింది. ఇందులో మంత్రి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. కేసు దర్యాప్తులో భాగంగా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డితోపాటు ఆయన సన్నిహితులు, పీఏలను విచారించింది. ఫోన్ కాల్స్ డేటాను కూడా విశ్లేషించింది.
నిందితులకు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్
ఈ కేసులో అరెస్టు అయిన ఇద్దరు నిందితులకు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉందన సీబీఐ చెప్పింది. గతంలో కూడా పలు మార్పు చోరీలకు పాల్పడినట్టు నిర్దారణైంది. వీటి కారణంగానే వాళ్లను ఫ్యామిలీ మెంబర్స్ కూడా దూరం పెట్టి ఉన్నారని... భార్యలు కూడా వారితో కలిసి ఉండటం లేదని వివరించారు. వారితో మంత్రి కాకాణికి, ఆయన సన్నిహితులకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు.
అన్నిచోట్ల మాదిరిగానే నెల్లూరు కోర్టులో చోరీ చేశారని... ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రమే తీసుకొని పత్రాలు పడేశారన్నారు. అవి మంత్రి కాకాణి గోవర్దన్ కేసుకు సంబంధించినవి అని తెలియదని ఛార్జ్‌షీట్‌లో సీబీఐ వెల్లడించింది. కాలువలో పారేసిన కోర్టుకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు, సీల్‌లు, ఇతర పరికరాలు మాత్రం పోలీసులకు లభించలేదు.
టీడీపీపై కాకాణి ఆగ్రహం
టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై కూడా సీబీఐ టీం ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇలా సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడంపై మంత్రి గోవర్దన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ లీడర్లు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు చంద్రబాబుపై ఉన్న కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు అంగీకరించి సవాల్‌కు సిద్ధపడాలన్నారు కాకాణి.