సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేతలు వ్యంగ్యపు ట్వీట్లు చేస్తున్నారు. ఓ వైపు వైఎస్ వివేకా హత్య కేసు, ఇంకో వైపు లిక్కర్ కేసుల్లో సీబీఐ, ఈడీ దూకుడుగా ఉన్నందునే తమ వారిని కాపాడుకొనేందుకు జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని విమర్శిస్తున్నారు.


పదే పదే ఎందుకు ఢిల్లీ వెళ్తున్నట్టు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. ‘‘అయిన‌నూ పోయి రావ‌లె హ‌స్తిన‌కు అని జ‌గ‌న్ రెడ్డి మ‌రోసారి ఢిల్లీ ఎందుకెళ్తున్నట్టు?’’ అని నారా లోకేశ్ ప్రశ్నించారు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. దీనికి లోకేశ్ మూడు ఆప్షన్లు కూడా ఇచ్చారు. ‘‘A) ఒక క‌న్నుని పొడిచిన మ‌రో క‌న్నుని కాపాడ‌టానికి, B) సీబీఐ అధికారి బ‌దిలీ  కోసం, C) లిక్కర్ స్కాంలో బుక్కయిన ఎంపీ కోసం’’ అని మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చారు. ఇక దీనిపై టీడీపీ అభిమానులు ఘోరమైన కామెంట్లు చేస్తున్నారు.






వివేకా కేసులో దూకుడుగా ఉన్న సీబీఐ
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్​ అవినాష్​ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను కోర్టు కొట్టేసింది. సీబీఐ విచారణపై స్టే ఇవ్వలేమని, హత్య కేసులో దర్యాప్తు కొనసాగివచ్చని సీబీఐకి అనుమతి ఇస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఒంగోలు ఎంపీ శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 18వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఆయన్ను ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి అరెస్టు కాగా, ఈడీ నోటీసులు చర్చనీయాంశం అయ్యాయి.


సీఎం ప్రధానికి విన్నవించిన అంశాలివీ..



  • రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తున్నా.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారం జరగలేదు.

  • గతంలో నేను ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్రం ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి కొంత పురోగతి సాధించింది. కీలక అంశాలన్నీ ఇంకా పెండింగులోనే ఉన్నాయి.

  • 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి.

  • గతంలో ఉన్న ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడిందన్న కారణంతో ఇప్పుడు రాష్ట్ర రుణాల పరిమితులపై ఆంక్షలు విధించారు. 2021–22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. 

  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానానుంచి రూ.2600.74 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. 2 సంవత్సరాలుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను.

  • పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. వెంటనే దీనికి ఆమోదం తెలపాల్సిందిగా కోరుతున్నారు.

  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10వేల కోట్లు మంజూరుచేయాలని కోరుతున్నాను.

  • తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన బకాయిలు అలానే ఉన్నాయి. 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను.