ఏపీలో ఇసుక తవ్వకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీడీపీ ఫిర్యాదులు చేసింది. రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లకు ఆ పార్టీ ఎంపీలు రామ్మోహన్, కనకమేడల లేఖలు రాశారు. ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా సర్కారు వ్యవహరిస్తోందని లేఖల్లో పేర్కొన్నారు.


బినామీలకే టెండర్లు


ప్రభుత్వ పెద్దల బినామీలకు టెండర్లు దక్కేలా నిబంధనలు రూపొందించారని, గతంతో పోల్చుకుంటే సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని చాలా వరకూ తగ్గించారని అన్నారు. నాన్ రిఫండబుల్ టెండర్ డాక్యుమెంట్ ధరను ఏకంగా రూ.29.50 లక్షల మేర వసూలు చేయడం ద్వారా కాంపిటీషన్ ను తగ్గించే ప్రయత్నం చేశారని లేఖలో వివరించారు. 


ప్రీ - బిడ్ మీటింగ్ ఏపీలో కాకుండా రహస్యంగా కోల్ కతాలో నిర్వహించారని, పక్కా వ్యూహంతోనే ఇసుక దోపిడీకి తెర లేపారని సీబీఐ, సీవీసీలకు రాసిన లేఖలో టీడీపీ ఎంపీలు ఆరోపించారు. ఇసుక టెండర్ల ప్రక్రియపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని కోరారు.


వైసీపీపై ఎంపీ రామ్మోహన్ విమర్శలు


ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీని చూసి పక్క రాష్ట్రాలు నవ్వుతున్నాయని, సీఎం జగన్ నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, దోచుకోవడానికే తన పదవిని వినియోగించుకున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో పేదవాడు కనీసం బతుకలేని స్థితి నెలకొందని, ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ధ్వజమెత్తారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమంగా నిర్భందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఏపీ భవిష్యత్తు బాగు కోసమే టీడీపీ - జనసేన పొత్తు. ఈ 2 పార్టీలు కలిస్తే చిత్తుగా ఓడిపోతామనే భయంతో వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. రాబోయే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు మేమే గెలుస్తాం. పులివెందులలో కూడా విజయం మాదే.' అని రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు.


Also Read: 'నా వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించింది' - చంద్రబాబు చస్తారన్న వ్యాఖ్యలపై గోరంట్ల క్లారిటీ