Botsa Satyanarayana Latest News: బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్న సమయంలో తన పదవిని అడ్డు పెట్టుకొని అవినీతికి పాల్పడ్డారంటూ ఏపీ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు అందింది. బొత్సపై టీడీపీ నేత వర్ల రామయ్య ఏసీబీకి ఈ ఫిర్యాదు అందించారు. ఏపీలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో బొత్స సత్యనారాయణ టీచర్ల ట్రాన్స్‌ఫర్‌ల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని వర్ల ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాలని ఏసీబీ అధికారులను కోరారు. ట్రాన్స్‌ఫర్ల కోసం ఒక్కో టీచర్‌ నుంచి రూ.3 లక్షల నుంచి దాదాపు రూ.6 లక్షల దాకా వసూలు చేశారని ఫిర్యాదులో వివరించారు. టీచర్ల బదిలీల్లోనే దాదాపు రూ.65 కోట్ల వరకు బొత్స సత్యనారాయణ వసూలు చేశారని ఈ ఫిర్యాదులో వివరించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఏపీలో ఉపాధ్యాయులను ట్రాన్స్‌ఫర్ చేశారని వర్ల రామయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.


వైసీపీ హాయాంలో బొత్స సత్యనారాయణ పేషీ నుంచే ఈ తతంగం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెబ్‌ కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా చేసిన ఈ ట్రాన్స్‌ఫర్లకు తాజాగా బ్రేక్‌ పడడంతో బొత్స పేషీలో రూ.లక్షలు కట్టిన వారంతా అయోమయంలో పడినట్లుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


టీచర్ల మామూలు ట్రాన్స్‌ఫర్లలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2023 జూన్‌లో దాదాపు 3 వేల మంది టీచర్లను వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారు. గవర్నమెంట్ స్కూళ్లలో స్టూడెంట్స్ - టీచర్స్ రేషియో ప్రకారం జీవో నెంబర్ 117 ప్రకారం ఈ ట్రాన్స్‌ఫర్ లు చేశారు. ఇదే సమయంలో హెచ్‌ఆర్‌ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) అధికంగా వచ్చే కీలక ప్రాంతాల్లోని పాఠశాలల్లో కొన్ని పోస్టులను గవర్నమెంట్ లోని కీలక వ్యక్తుల ఆదేశాల ప్రకారం.. డీఈవో ఆఫీసు అధికారులు బ్లాక్‌ లిస్టులో పెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వీటితోనే అక్రమాలకు పాల్పడినట్లుగా టీడీపీ ఆరోపిస్తోంది.


బొత్స క్లారిటీ
తనపై వస్తున్న ఆరోపణలపై బొత్స సత్యనారాయణ రెండు రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చారు. కొంత మంది టీచర్లు తమ ఆరోగ్య, కుటుంబ సమస్యల కారణంగా ట్రాన్స్‌ఫర్లు కోరుకున్నారని.. వాటిని పారదర్శకంగా చేశామని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఈ బదిలీలు నిలిపివేయాలని అధికారులను కోరినట్లు చెప్పారు. కొత్త ప్రభుత్వం తనకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. టీచర్ల ట్రాన్స్‌ఫర్ల కోసం తాము ఎక్కడా లంచాలు తీసుకోలేదని బొత్స సత్యనారాయణ వివరించారు.