Prathipati Pullarao Son Arrest :  ఆంధ్రప్రదేశ్ టీడీపీ సీనియర్ నేత, ఇటీవల చంద్రబాబు ప్రకటించిన జాబితాలో చిలుకలూరిపేట నుంచి టిక్కెట్ దక్కించుకున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను కృష్ణా జిల్లా మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన జీఎస్టీ ఎగవేశారని అభియోగం నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్‌కు చెందిన ఆవేక్సా కార్పొరేషన్ అనే కంపెనీ నడుపుతున్నారు.  జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో ఆయనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అత‌డిపై జిఎస్టీ అధికారులు పిర్యాదు చేయ‌డంతో విచారణ జరిపిన పోలీసులు నేడు శరత్‌ను అరెస్ట్ చేశారు.                               


శరత్ అరెస్ట్‌ను స్థానిక టీడీపీ నేతలు ఖండించారు. ఎన్నికలు వస్తున్న సమయంలో పోలీసులతో కుమ్మక్కై అధికార పార్టీ నేతలు కావాలనే టీడీపీ నేతలను అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు. శరత్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ తరపున చిలకలూరి పేట అభ్యర్థిగా శరత్ తండ్రి పత్తిపాటి పుల్లారావును అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనను మానసిక క్షోభకు గురి చేసేందుకే అధికార పార్టీ నాయకులు పన్నాగాలు పన్నుతున్నారని పుల్లారావు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పత్తిపాటిని ఢీకొట్టలేకనే ఇలాంటి కుట్రలకు తెర తీస్తున్నారని మండిపడ్డారు.                                                      


తన కుమారుడి అరెస్టుపై ప్రత్తిపాటి పుల్లారావు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. 1999 నుండి చిలుకలూరిపేట రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. మొదట టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2004లో ఓటమి చెందిన ఇతను మళ్ళీ 2009, 2014 ఎన్నికల్లో గెలుపొందారు. చంద్రబాబు మంత్రిమండలిలో పుడ్‌ అండ్‌ సివిల్‌ సప్లైయ్స్‌, కన్జూమర్‌ వ్యవహారాలు, ధరల నియంత్రణ శాఖల మంత్రిగా పని చేశాడు . పదేళ్లపాటు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన చాలా కాలం  రాజకయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల చిలుకలూరిపేటలో చురుగ్గా మారారు. తనకే టిక్కెట్ కేటాయించాలని పట్టుబట్టి మరీ అభ్యర్థిత్వం ఖరారు చేయించుకున్నారు.                               


టీడీపీ నుంచి  భాష్యం ప్రవీణ్ అనే మరో నేత చిలుకలూరిపేటలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ విషయంపై ప్రత్తిపాటి పుల్లారావు అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఆయనను తన నియోజకవర్గంలో తిరగనీయవద్దని హైకమాండ్ పై ఒత్తిడి చేశారు. చివరికి టిక్కెట్‌ను తానే దక్కించుకున్నారు.