Punganuru Constituency News: చిత్తూరు జిల్లా పుంగనూరు (Punaganuru) నియోజకవర్గం.. రాష్ట్ర మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్య వహిస్తున్న ప్రాంతం. ఇక్కడ అధికార, ప్రతిపక్షాల మధ్య ఎల్లప్పుడూ యుద్ధ వాతావరణ పరిస్థితే కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ(TDP), వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో పుంగనూరు(Punganuru), అంగళ్లు(Angallu)లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చంద్రబాబు యాత్ర సందర్భంగా ఘర్షణ జరగ్గా పలువురు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు టీడీపీకి మద్దతుగా శ్రీకాకుళం నుంచి సైకిల్ యాత్ర చేస్తూ పుంగనూరు చేరుకున్న వారిపై కొందరు దాడి చేయడం సైతం కలకలం రేపింది. పసుపు దుస్తులు ధరించిన వారి బట్టలు విప్పించి దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో పోలీసులు దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. అయితే, ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో మంత్రి ఇలాఖాలో పొలిటికల్ హీట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో ఏం జరుగుతున్నా టీడీపీ శ్రేణులు మిన్నకుండిపోయారు. కాగా, పుంగనూరులోని ప్రతి గ్రామంలో పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పేరు చెప్పే నాయకులు కోకొల్లలు. ఆయన పర్యటన అంటేనే పరుగులు తీస్తారు. తన ఇంటి వద్దకు వెళ్తే కోరుకున్న పని జరుగుతుందనేది ప్రజలు బలంగా నమ్మే రీతిలో రాజకీయాలు నడుపుతున్నారు.


బీసీవై పార్టీ జోరు..


పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పోటీ పడుతున్న మరో నాయకుడు భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకులు రామచంద్ర యాదవ్. ఈయన టీడీపీ కంటే ముందుకు దూసుకెళ్తున్నారు. ఈయన గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ప్రభుత్వం, మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శలు సంధిస్తూ దూసుకెళ్తున్నారు. అయితే, ఇక్కడ ఈయన సమావేశం ఇప్పటికీ నిర్వహించే పరిస్థితి లేకుండా, పర్యటన సైతం అడ్డుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ఈయనకు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో రామచంద్రా యాదవ్ నుంచి మంత్రి పెద్దరెడ్డికి గట్టి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


ప్రధాన విమర్శలివే


సాక్షాత్తు మంత్రే ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యమని.. ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తప్ప చేసిన అభివృద్ధి ఏదీ లేదనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. గతంలో వరదల కారణంగా మరమ్మతులకు గురైన వంతెనలు, చెరువులు బాగు చేయలేదని చెబుతున్నారు. అయితే, వీటిని మంత్రి అనుచరులు తోసిపుచ్చారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ప్రజలు చూశారని.. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాయని పేర్కొంటున్నారు. ఈసారి ఆయన్ను కచ్చితంగా గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు.


పట్టు కోసం టీడీపీ యత్నం


అటు, నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీకి కూడా అధికార పార్టీతో సమానంగా బలం ఉంది. ఇక్కడ పెద్దిరెడ్డిని ఓడించాలనే గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రతీ గ్రామంలో ఇరు పార్టీల మధ్య వాదోపవాదాలు, గొడవలు, పంచాయితీ సర్దుబాటు ఇలా నిత్యం రాజకీయ హడావుడి తప్పదు. ఇక అధికారం ఎవరైతే ఆ పార్టీ వారు చెప్పిందే ఆ గ్రామం, మండలంలో హవా. ఈ క్రమంలో నియోజకవర్గంలో పట్టు కోసం టీడీపీ నేతలు శ్రమిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే తాము అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధిని.. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఆయనపై విజయం సాధించే అభ్యర్థి కోసం కృషి చేస్తున్నారు.


అటు టీడీపీ - జనసేన కూటమి, ఇటు అధికార వైసీపీ నేతలు ఇక్కడ గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. మరి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారో.. ఎవరి హామీలను నమ్మారో తెలియాలంటే ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే!


Also Read: Visakha News: 'మోదీజీ గంజాయి రాజధాని అనే చెడ్డపేరు తొలగించండి' - జన జాగరణ సమితి ఫ్లెక్సీ