Bonda Uma : శ్రీవారి భక్తుల దర్శనం కోసం అమ్ముతున్న శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ల వ్యవహారం సంచలనం అవుతోంది. తాజాగా టీటీడీ చైర్మన్ ప్రకటించిన వైట్ పేపర్ లో అసలు వివరాలే లేవని.. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. శ్రీవాణి ట్రస్టుకు వచ్చే సగం నిధులను తాడేపల్లి దేవస్థానానికి తరలిస్తున్నారంటూ ఆరోపించారు.జగన్ ప్రభుత్వం వచ్చాక.. శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ ట్రస్ట్ ద్వారా రోజుకు వేయి టిక్కెట్లకు పైగా అమ్ముతున్నారని.. అన్నీ ఆఫ్ లైన్‌లో నగదుకు అమ్మడం ఏమిటని ప్రశ్నించారు. సామాన్యులు వెళ్లే రూ. 300 టిక్కెట్లకు ఆఫ్ లైన్ సదుపాయం లేదన్నారు. కానీ, రూ. 10 వేల ధర ఉన్న శ్రీవాణి టిక్కెట్లను ఆఫ్ లైన్ లో ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. కొన్ని ఎయిర్ పోర్టులో, కొన్ని కొండపై, మరికొన్ని ఆన్ లైన్ లో శ్రీవాణి టిక్కెట్లను అమ్ముతున్నామని చెబుతున్నారని తెలిపారు.
రోజుకూ వేయి టిక్కెట్లు అమ్ముతున్నారో.. 1500 టిక్కెట్లు అమ్ముతున్నారో ఎవరికి తెలుసని అని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి చెప్పిన లెక్కల ప్రకారమే రోజుకు వేయి టిక్కెట్లు అమ్మితే.. నాలుగేళ్లల్లో సుమారు రూ. 1500 కోట్లు రావాలని తెలిపారు. కానీ, శ్వేతపత్రంలో మాత్రం రూ. 860 కోట్లే అంటున్నారని పేర్కొన్నారు. శ్రీవాణి పేరుతో సగం డబ్బులు కొట్టేశారా ? అని ప్రశ్నించారు. మిగిలిన శ్రీవాణి ట్రస్టు నిధులు సుమారు రూ. 700 కోట్లను తాడేపల్లి దేవస్థానానికి తరలించారా? అని నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్యేల రాజకీయం కోసం శ్రీవాణి నిధులను వెచ్చిస్తారా? మండిపడ్డారు. ఒక్క ఫౌండేషనుకే గుళ్లు కట్టమని నిధులిచ్చారని, ఆ ఫౌండేషన్‌కు ఉన్న క్రెడిబులిటీ ఏంటని ప్రశఅనించారు.
ఆ సంస్థకే నిధులు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో భూముల సెటిల్ మెంట్ల కోసం పక్క రాష్ట్రాలకు స్వామి వారి నిధులిస్తారా? అని మండిపడ్డారు. తాము అడక్కుండానే వైవీ సుబ్బారెడ్డి నిధులిచ్చారని కేటీఆర్ చెప్పారని పేర్కొన్నారు. లాబీయింగ్ చేసుకోవడానికి ఫ్లైల్ లు వేసుకుని వెళ్తారా..? అని మండిపడ్డారు.శ్రీవాణి ట్రస్టు నిధులా..? వైసీపీ డబ్బులా..? శ్రీవాణి ట్రస్టు నిధులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. శ్రీవాణి ట్రస్టుపై విమర్శలు చేస్తే కేసులు పెడతారా..? నిలదీశారు. శ్రీవాణి ట్రస్టు విరాళాలిచ్చే వారి పేర్లు వెబ్ సైటులో పెట్టాలని సూచించారు. పింక్ డైమండ్ కొట్టేశారన్న విజయసాయి రెడ్డిపై ఏం కేసులు పెట్టారో చెప్పాలన్నారు.
భక్తులు డబ్బులు ఏమయ్యాయంటే కేసులు పెడతారా..? అని మండిపడ్డారు.శ్రీవాణి ట్రస్ట్ ముఖ్య ఉద్దేశ్యం జీర్ణావస్థలో ఉన్న దేవాలయాల పునరుద్దరణ అని అన్నారు. ఏపీలో జీర్ణావస్థలో ఉన్న గుళ్లు లేవా..? పక్క రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలకు అమ్మడమేంటీ..? అని నిలదీశారు. తమ హయాంలో పింక్ డైమండ్ పోయిందన్నారు..? చంద్రబాబు కొట్టేశారన్నారని పేర్కొన్నారు. మరి పింక్ డైమండ్ సంగతి ఏమైంది..? ఏం చేశారు..? ప్రశ్నించారు. పింక్ డైమండ్ పై తాము అధికారంలో ఉన్నప్పుడు కోర్టులో కేసు వేశామని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పిటిషన్ ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని ప్రశ్నించారు.