AP Fake Votes :   ఏపీలో  అనేక నియోజకవర్గాలలో వేల ఓట్లను అక్రమంగా తొలగించారని పెద్ద  ఎత్తున దొంగ ఓట్లను చేర్చారన్న ఆధారాలతో సహా ఢిల్లీ వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది.  ఈ నెల 28న  చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లో చీఫ్ ఎలక్షన్ కమిషర్ కు ఫిర్యాదు చేయనున్నారు.   ఉరవకొండ, విశాఖ ఈస్టు, పర్చూరు నియోజకవర్గాల్లో అవకతవకలపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు.  ఉరవకొండలో ఓట్ల తొలగింపుపై ఇద్దరు ఉన్నతాధికారుల సస్పెన్షన్ కు గురయ్యారు.  రాష్ట్రం వ్యాప్తంగా జరిగిన అక్రమాల్లో బాధ్యులపై చర్యలకు టీడీపీ డిమాండ్ చేస్తోంది.  రాష్ట్ర ప్రభుత్వం కుట్రతో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఓట్లు తొలగించిందని టీడీపీ ఆరోపిస్తోంది.  నిబంధనలకు విరుద్దంగా తొలగించిన ప్రతి ఓటుపై దర్యాప్తుకు   టీడీపీ పట్టుబడుతోంది.  


 రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణలో చోటు చేసుకున్న అవకతవకలపై కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలవాలని చంద్రబాబు నిర్ణయానికి వచ్చారు.  టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు వందో జయంతి సందర్భంగా ఈ నెల 28వ తేదీన ఢిల్లీలో ఆయన స్మృత్యర్థం ప్రత్యేక నాణేలను విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.  అదే రోజు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆయన కలిసే అవకాశం ఉంది. అపాయింట్మెంట్‌ కోరుతూ ఆయన కార్యాలయం ఎన్నికల కమిషన్‌కు లేఖ పంపింది. మూడు అంశాలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని టీడీపీ భావిస్తోంది. 


నియోజకవర్గాల్లో టీడీపీ సానుభూతిపరుల ఓట్లను వైసీపీ నేతలు ఇష్టానుసారం తొలగిస్తున్నారని, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.   నగరాలు, పట్టణాల్లో టీడీపీ సానుభూతిపరుల ఓట్లను చెల్లాచెదురు చేస్తున్నారని, ఒక కుటుంబానికి చెందిన ఓట్లు ఒకే పోలింగ్‌ బూత్‌ పరిధిలోనే ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ, వాటిని కావాలని అనేక చోట్లకు మార్చి ఓట్లు వేయకుండా నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారన్నరని ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.  వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లను నకిలీ డోర్‌ నంబర్లు, నకిలీ చిరునామాలతో ఓటర్ల జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తున్నారని, కింది స్థాయి అధికారులు దీనిని అడ్డుకొనే ప్రయత్నం చేయడం లేదని కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.  వీటికి సంబంధించిన పలు ఆధారాలను కూడా చంద్రబాబు తీసుకువెళ్లనున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 


అనంతపురం జిల్లా ఉరవకొండలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ వేటు వేసింది.  విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ తన నియోజకవర్గంలో ఏకపక్షంగా 40 వేల ఓట్లు తొలగించారని ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేశారు. తన నియోజకవర్గంలో ఏడు వేల ఓట్ల తొలగింపునకు అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతో పాటు తిరుపతి నగరం, చంద్రగిరి నియోజకవర్గాల్లో కూడా అక్రమాలు భారీగా జరిగాయని అక్కడి టీడీపీ నేతలు ఇప్పటికే ఫిర్యాదులు పంపారు. టీడీపీ అధిష్ఠానం తమ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాల నుంచి దీనిపై సమాచారం సేకరిస్తోంది.