కొందరు చంటి పిల్లలకు ఆరు నెలలకే తల్లిపాలు మానిపిస్తారు. మరికొందరు ఏడాదికి, ఇంకొందరు రెండేళ్ల వరకు తల్లిపాలు పెడతారు. ఎప్పుడు తల్లిపాలు మానిపిస్తే వారిపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉంటుందో వైద్యులు వివరిస్తున్నారు.


చంటి పిల్లలకు ఆరు నెలల వయసు వచ్చాక బయటి ఆహారాన్ని ఇవ్వడం మొదలుపెడతారు. ఉడకబెట్టిన ఆహారాలు, రాగి జావ, అన్నాన్ని జావలా చేసి వారి చేత తినిపించడం వంటివి చేస్తూ ఉంటారు. తల్లిపాలతో పాటు ఇలా ఘన రూపంలో ఆహారాన్ని అందించడం వల్ల వారి ఎదుగుదల బాగుంటుంది. అయితే హఠాత్తుగా తల్లిపాలు మానిపిస్తే మాత్రం వారిపై చాలా ప్రభావం పడుతుంది. పిల్లలు పుట్టిన ఆరు నెలల పాటు కేవలం వారికి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాతే తల్లిపాలను మానిపించే ప్రక్రియ మొదలు పెట్టాలి. హఠాత్తుగా తల్లిపాలను మానిపించకూడదు. రోజులో కనీసం ఐదు నుంచి ఆరుసార్లు తల్లిపాలు ఇస్తూనే, బయట ఆహారాన్ని తినిపిస్తూ ఉండాలి. ఆరు నెలల వయసు తర్వాత తల్లిపాలను తగ్గించాలి. కానీ పూర్తిగా మానిపించకూడదు. ఆరు నెలల తర్వాత కూడా కేవలం తల్లిపాలు ఇచ్చేవారు ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఐరన్, ఇతర పోషకాలు లోపించే అవకాశం ఉంది. కాబట్టి ఆరు నెలల వయసు దాటాక తల్లిపాలతో పాటు ఇతర ఆహారాలను అలవాటు చేయాలి.


మొదట ఆరు నెలల వయసులో లిక్విడ్ డైట్ ను పిల్లలకు ప్రారంభించాలి. కూరగాయలను మెత్తగా ఉడికించి జ్యూస్ లా చేసి వాటిని తినిపించాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఇతర ఆహారాలను రుచి చూసేందుకు ఇష్టపడతారు. అన్నం వంటి వాటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేశాకే వారికి తినిపించాలి. గట్టిగా ఉండే ఘనాహారాన్ని పెట్టకూడదు. అన్నాన్ని కూడా నీళ్లు కలిపి జావలా చేయాలి. అప్పుడే వాళ్ళు మింగగలుగుతారు.


అలా ఎప్పుడైతే బయటి ఆహారాన్ని తినడం పిల్లలు ప్రారంభిస్తారో తల్లిపాలు తాగడం ఆటోమేటిక్‌గా తగ్గిస్తారు. నిద్రపోయే సమయాల్లో మాత్రమే వారికి తల్లిపాలు అవసరం పడతాయి. దీనివల్ల తల్లికి కూడా ఒత్తిడి తగ్గుతుంది. పిల్లలు ఏడాది వయసు వచ్చేసరికి తమంతట తాము తినడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ సమయంలో వారు తల్లిపాలను ఇంకా తగ్గిస్తారు. ఆరు నుంచి 12 నెలల వరకు పిల్లలకు లిక్విడ్ డైట్‌నే అలవాటు చేయాలి. ఓ పక్క తల్లిపాలు తాగిస్తూ లిక్విడ్ డైట్ ఇస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. ఏడాది నిండాక మాత్రం మెత్తగా ఉన్న గణాహారాన్ని అలవాటు చేయాలి. పోషక సమస్యలు లేకుండా ఉడికించిన క్యారెట్, పాలకూర, ఆపిల్, బంగాళదుంప లాంటివి పిల్లలకు తినిపిస్తూ ఉండాలి. ఏడాది దాటాక పిల్లలు తల్లి పాలను మానేసినా పెద్దగా ప్రమాదం లేదు. వారికి కావాల్సిన పోషకాలన్నీ అందిస్తూ ఉంటే వారిలో పోషకాహారలేమి రాకుండా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్లో ఐరన్ లోపిస్తూ ఉంటుంది. కాబట్టి వారికి బెల్లంతో చేసిన ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి. దీనివల్ల తల్లిపాలు ఆపేసిన కూడా వారిలో ఐరన్ లోపం రాదు.


Also read: మగవారు వాసెక్టమీ చేయించుకుంటే లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందా?




గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.