YSRCP MLA Prakash Reddy: అమరావతి: జే-టాక్స్ కోసం వైసీపీ సైకోలు రాష్ట్ర పరువు తీస్తున్నారంటూ టీడీపీ(TDP) నేతలు మండిపడుతున్నారు. రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పశ్చిమ బెంగాల్ పౌరులను బంధించారని అనంతపురం (Anantapur) జిల్లా కలెక్టర్‌కు బెంగాల్ ఎంపీ ఫిర్యాదు చేయటం మన రాష్ట్రానికే సిగ్గు చేటు అన్నారు. ఈ మేరకు టీడీపీ అధికారిక ట్విట్టర్ పేజీలో స్పందించారు.


కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు: టీడీపీ 
అనంతపురం రూరల్ మండలంలోని కొడిమి ప్రభుత్వ లేఅవుట్ కాలనీ కాంట్రాక్ట్‌ను పశ్చిమ బెంగాల్ వ్యక్తి సర్వర్‌ జహాన్‌కు ఇచ్చారు. అతను బెంగాల్ నుంచి కూలీలను తెప్పించి ఆ పనులను పూర్తి చేస్తున్నారు. కాలనీ నిర్మిస్తున్నందుకు తమకు డబ్బులు ఇవ్వాలని, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నేరుగా ఆ కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా డబ్బులు ఇవ్వలేదని స్థానిక పోలీసులకు చెప్పి కాంట్రాక్టర్‌ను అక్కడ పని చేసే కూలీలను అరెస్టు చేయించారని పేర్కొన్నారు. 


జే-టాక్స్ కట్టలేదని ఆ కాంట్రాక్టర్ వద్ద పనిచేసే 11మంది కూలీలను నిర్బంధిస్తే పశ్చిమ బెంగాల్ ఎంపి కలెక్టర్, ఎస్పీకి లేఖ రాశారు. అంటే ఇతర రాష్ట్రాల ముందు మన రాష్ట్ర పరువు పోయినట్టే అని ప్రతిపక్ష టీడీపీ నేతలు పేర్కొన్నారు. గతంలో కూడా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధన దాహానికి, వేల మందికి ఉపాధి కల్పించే అవకాశమున్న జాకీ పరిశ్రమ ఇక్కడి నుంచి తరలిపోయిందని గుర్తుచేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి శిష్యుల డబ్బు పిచ్చికి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ పారిశ్రామికవేత్త అయినా ముందుకు వస్తాడా ? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.


అసలేం జరిగిందంటే.. 
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తిపై ఫిర్యాదు రావడంతో ఒక్కసారిగా జిల్లాయంత్రాంగం అప్రమత్తమైంది. ఇంతకీ పశ్చిమబెంగాల్‌ ఎంపీ ఏహెచ్‌ ఖాన్‌ చౌదరి చేసిన ఆ ఫిర్యాదులో ఏముంది అంటే.. అనంతపురం రూరల్ మండలంలోని కొడిమి జగనన్న లేఅవుట్ కాలనీ కాంట్రాక్ట్‌ను పశ్చిమ బెంగాల్ వ్యక్తి సర్వర్‌ జహాన్‌కు ఇచ్చారు.  ఆ పనులను సొంత రాష్ట్రం నుంచి కూలీలను తెప్పించి పనులు పూర్తి చేస్తున్నారు.


విచారణ చేసి నిర్బంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లాయంత్రాంగానికి ఎంపీ డిమాండ్ చేశారు. ఇందులో ఎమ్మెల్యే పేరు కూడా వినిపిస్తున్నందున వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీక్రెట్‌గా విచారించారు. అసలు ఏం జరిగిందో తెలుసుకున్నారు. మీడియాకు తెలియడంతో పోలీసులు మాత్రం మాట దాటవేస్తున్నారు. అలాంటి కిడ్నాప్‌లు ఏం జరగలేదని చెబుతున్నారు. అయితే తమను బెదిరించిన ఫోన్ కాల్‌ లిస్టును కూడా ఉన్నతాధికారులకు ఎంపీ పంపించినట్టు తెలుస్తోంది. అన్ని ఆధారాలు ఉన్నందున నేరుగా జిల్లా కలెక్టర్‌కు లెటర్ రాశారు.


ఎమ్మెల్యే తోపుదుర్తి కూడా తనకు బెదిరింపుల సంగతే తెలియదని అంటున్నారు. అది రెండు సంస్థల మధ్య వివాదమని వాళ్లే తేల్చుకోవాలన్నారు. ఎమ్మెల్యేగా వారితో తనకేం పని అని ప్రశ్నిస్తున్నారు. సకాలంలో పని పూర్తి చేసి ఇవ్వాలని చెప్పి ఉంటానని వివరిస్తున్నారు. 


ఈ ఆరోపణలపై ఘాటుగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పందించారు. కొడిమి జగనన్న కాలనీలో త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని భావించామన్నారు. ఒక్కో ఇల్లు 1.80 లక్షల రూపాయలకు నిర్మించేలా లోటస్ ఎంటర్ ప్రైజేస్‌తో ఒప్పందం కుదిరిందని వివరించారు. ఇళ్ల నిర్మాణ పనులపై నిర్లక్ష్యం చూపుతున్న కాంట్రాక్టు సంస్థను నిలదీశామని పేర్కొన్నారు. 55 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని కాంట్రాక్టు సంస్థ మోసం చేసిందని ఆరోపించారు. మోసగాళ్లకు పరిటాల శ్రీరామ్, సీపీఐ నేత రామకృష్ణ వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.