TDP News : గురజాల నియోజకవర్గంలో పోలింగ్ బూత్ ల మార్పుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ ఫిర్యాదు చేసింది. గురజాల నియోజకవర్గంలో ఫ్యాక్షన్ ప్రభావం అధికమని, ఇప్పటికే ఆ ప్రాంతంలో ఫ్యాక్షన్ ప్రభావంతో ఊళ్లకు ఊళ్లే ఖాళీ అయ్యాయని, అలాంటి నియోజకవర్గంలో ఇష్టానుసారం పోలింగ్ బూత్ లు మారిస్తే, ఎన్నికల వేళ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ఎన్నికల సంఘం అధికారి దృష్టికి తీసుకెళ్లారు.
టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని అశోక్ బాబు కలిశారు. “2021 అక్టోబర్లో గురజాల శాసనసభ్యులు కాసు మహేశ్ రెడ్డి తన నియోజకవర్గంలోని మూడు పోలింగ్ బూత్ లు మార్చాలని అప్పటి జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారన్నారు. సదరు లేఖను కలెక్టర్ ఆర్డీవోకు పంపితే, ఆర్డీవో ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి, స్థానికంగా అన్నిపార్టీలతో సంప్రదించాకే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కానీ అవేవీ చేయకుం డా ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులు, పోలింగ్ బూత్ లు మార్చేశారని ఆరోపించారు.
గ్రామాల్లో ఏ పోలింగ్ బూత్ ఎక్కడుంటే, ఎలాంటి ఇబ్బంది ఉండదో అక్కడే ఉంచాలి. సాధారణం గా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో గ్రామాల్లో ప్రజల మధ్య పట్టింపులు, పంతాలు ఎక్కువగా ఉంటాయి. ఒక వీధిలోని వారు మరో వీధిలోకి వెళ్లే పరిస్థితే ఉండదు. అలాంటి నియోజకవర్గమైన గురజాల నియోజకవర్గంలోని గ్రామాల్లో పోలింగ్ బూత్ లు మార్చేశారన్నారు. అధికారులు చేసిన దానిపై స్థానిక టీడీపీ నాయకత్వం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సమస్యను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
గురజాల నియోజకవర్గంలో 6 గ్రామాల్లోని 18 పోలింగ్ బూత్ లను ఇష్టానుసారం మార్చేశారు. పిన్నెల్లిలో ఒకేచోట 9 బూత్ లు ఏర్పాటు చేశారు. అది ఎలా సాధ్యమో ఎన్నికల అధికారులు సమాధానం చెప్పడంలేదన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు.. నిబంధనలు ఏవీ క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలుకావడం లేదు. ఈ నెల 27, 28 తేదీల నాటికి ఓటర్ల జాబితా వస్తుంది కాబట్టి... అప్పుడు కొత్త జాబితా ప్రకారం మా అభ్యంతరాలను మరలా ఎన్నికల కమిషన్ ముందు పెడతామన్నారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి బూత్ లు ఎక్కడ పెట్టినా, ఎన్నికలు ఆయన అనుకున్నట్టు జరగవు. ఈ విషయంపై అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా సంప్రదిస్తాం. పోలింగ్ బూత్ లు ఇష్టానుసారం మార్చేసి, తమకు అనుకూలంగా ఓటింగ్ సరళిని మార్చుకుందామని అధికారపార్టీ ఆలోచిస్తే చూస్తూ ఊరుకోం.” అని అశోక్ బాబు స్పష్టం చేశారు.
సెప్టెంబర్లో గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి టౌన్ తో పాటు, మరో రెండు చోట్ల పోలింగ్ బూత్ లు మార్చారు. ఒక్కో చోట ఒక్కో కారణం చెప్పి బూత్ లు మార్చారు. ఈ విషయం కూడా ప్రధానాధికారికి తెలియచేశామని అశోక్ బాబు తెలిపారు. బూత్ ల మార్పు అనేది ఇది వరకే జరిగి పోయింది.. దాన్ని ఇప్పుడు సరి చేయడం కుదరదని సదరు అధికారి తెలియచేశారని.. మరలా కొత్త ఓటర్ జాబితా వచ్చాక మీరు చెప్పిన అభ్యంతరాలపై పునరాలోచిస్తామని తెలిపారన్నారు. అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదించి మీరు లేవనెత్తిన సమస్యలపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి చెప్పారన్నారు.