TDP News :  ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల జాబితాలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని బృందం  ఈసీని కలిసింది. తెలుగుదేసం పార్టీ సానుభూతిపరుల ఓట్లే లక్ష్యంగా  తొలగించడంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.  రాజకీయ ఒత్తిళ్లతో తప్పుడు ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సంఘం  ఆదేశాలను అధికారులు పాటించడం లేదన్నారు.  దేశంలో ఏ ఎన్నికలు వచ్చినా సరే ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకుంటారు కానీ ఏపీలో సీఎం జగన్‌ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.                               


వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి  వారి కనుసన్నల్లోనే ఎన్నికలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.  ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు.  అక్టోబర్‌ 27 వరకు దేశమంతా ఓటరు వెరిఫికేషన్‌ ప్రక్రియ జరిగిందన్నారు.  కానీ ఏపీలో ఆ విధానంపూర్తిగా జరగలేదని ఆ విషయాన్ని ఆధారాలతో సహా వివరించామన్నారు.  ష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది ఫారమ్‌ 6, ఫారమ్‌ 7, ఫారమ్‌ 8ని అప్లై చేశారు. వీటిపై ఎన్నికల సంఘం దృష్టి సారించలేదని అచ్చెన్నాయుడు తెలిపారు.                          


 ఏపీలో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకే పోలింగ్‌ బూత్ పరిధిలో ఓట్లేసే వారని కానీ  ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు.  కుటుంబంలో నలుగురు ఉంటే ఒక్కొక్కరికి ఒక్కో పోలింగ్‌ బూత్‌ పరిధిలో పేరు నమోదు చేశారని ఆరోపించారు.  ఇలా ఇష్టానుసారంగా చేయడంపై ఈసీ దృష్టికి తీసుకెళ్లామని..   రాష్ట్రంలో డెత్‌ సర్టిఫికెట్లతో సహా చనిపోయినవారి వివరాలు ఇచ్చామని అచ్చెన్నాయుడు తెలిపారు.  ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నట్లు ఆధారాలతో సహా చూపించామని.. కానీ  ఈ ఓట్లను ఈసీ తొలగించలేదన్నారు.  వాలంటరీ వ్యవస్థను వినియోగించి  టీడీపీ ఓట్లను సానుభూతిపరుల ఓట్లను మాత్రం ఇష్టానుసారంగా తొలగించారని..  సుమారు 160 పోలింగ్‌ స్టేషన్లు ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు.             


 గ్రామ సచివాలయ ఉద్యోగులను బీఎల్‌వోలుగా నియమించారు. దొంగ ఓట్లు తొలగించాలని ఈసీని కోరామని అచ్చెన్నాయుడు తెలిపారు.  తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు తెలిపారని అచ్చెన్నాయుడు మీడియాకు తెలిపారు. ఏపీ ఓటర్ల జాబితా అంశంపై చాలా కాలంగా వివాదం రేగుతోంది. వైసీపీ నేతలకు డబుల్, త్రిబుల్ ఓట్లు ఉన్నా.. వెరఫికేషన్ తొలగించలేదు.కానీ ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన  వారి ఓట్లు మాత్రం.. తీసేసేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా తమ పరిశీలనలో గుర్తించిన అంశాలన్నింటినీ టీడీపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.