Andhra News :   ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రోడ్ల నిర్మాణం పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  రోడ్లు బాగోలేవని వచ్చే ఎన్నికల్లో వైసీపీని వద్దనుకోవద్దని ఆయన ఓ మీటింగ్ లో ఓటర్లను కోరారు.  రోడ్ల వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయా? అని ఆయన ప్రశ్నించారు. చెన్నై, కర్నూలు రాష్ట్ర రాజధానులుగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు అక్కడకు వెళ్లడానికి రెండు రోజులు పట్టేదని చెప్పారు. విశాఖ కంటే గొప్ప అర్హతలు ఉన్న రాజధాని ఏపీలో లేదని అన్నారు. విశాఖ రాజధాని వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో విద్యుత్తు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని… మన కంటే ధరలు తక్కువ ఉన్న రాష్ట్రం ఏదో చెప్పాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన ఉపయోగం లేని పనులు ఏమిటో టీడీపీ నేతలు చెప్పలేకపోతున్నారన్నారు.  



రోడ్లపై ధర్మాన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సెటైర్లు వేసింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో కిలోమీటర్ రోడ్డు కూడా ఎందుకు వేయలేదా అనుకున్నాం. ఈ తెలివితేటలే కారణం అన్నమాట! చరిత్రలో రోడ్లు వేసిన పాలకులంతా పిచ్చోళ్ళన్నట్టేనా మంత్రి ధర్మాన ప్రసాదరావు గారూ? ఇక రోడ్లు వేయడానికి ఒక మంత్రిత్వ శాఖ, దానికో మంత్రి కూడా అక్కర్లేదన్న మాట అని కౌంటర్ ఇచ్చింది.  



 


రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు బాగుంటేనే అభివృద్ధి జరుగుతుందని ఎవరైనా చెబుతారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల్లో అత్యంత ముఖ్యమైనది రోడ్లు. కానీ ఏపీ మంత్రి అసలు రోడ్ల వల్ల ఉపయోగమే లేదని చెబుతున్నారు. ఏపీలో గత నాలుగున్నరేళ్ల కాలంలో కొత్తగా రోడ్లు నిర్మించలేదని .. నిర్వహణ చేపట్టకపోవడం వల్ల రోడ్లన్నీ గుంతలు తేలిపోయాయన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభత్వం మాత్రం రోడ్లు బాగున్నాయని గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తున్నామని  చెబుతోంది. కానీ మంత్రులు మాత్రం రోడ్ల వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.                


మరో మంత్రి కొడాలి నాని కూడా రోడ్ల పరిస్థితిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క పథకం ఆపినా రాష్ట్రంలో రహదారులు వేయడం పెద్ద కష్టమేమీ కాదని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు వేయాలంటే రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు సరిపోతాయన్నారు. దీనికి డ్వాక్రా మహిళలకు ఇచ్చే ఒక్క విడత లబ్ధిని ఆపినా చాలన్నారు. రోడ్లపై ఉన్న చిన్నచిన్న గుంతల వద్ద చేరి తెదేపా, జనసేన నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.