Chandrababu Visits Pawan Kalyan In Hyderabad: హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసానికి తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి వెళ్లారు. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు ఉన్నందున పవన్, చంద్రబాబు భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై జనసేనానితో చంద్రబాబు చర్చించేందుకు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ మేనిఫెస్టో, లేక ఉమ్మడి మేనిఫెస్టోనా అనే అంశాలపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది. వచ్చే ఎన్నికల్లో జనసేన సీట్ల సర్దుబాటు సైతం ఈ భేటీలో కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 


తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసింది. బీజేపీ 111 స్థానాల్లో బరిలోకి దిగగా, జనసేన 8 స్థానాల్లో పోటీ చేసింది. 8 మంది బీజేపీ అభ్యర్థులు విజయం సాధించి అసెంబ్లీలో కాలుపెట్టగా, జనసేన అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. దాంతో జనసేనతో తెలంగాణలో పొత్తులు ఇక లేవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.  పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, సర్వేలకు అందని విధంగా లోక్ సభ ఫలితాలు ఉంటాయన్నారు. జనసేన సొంతంగా 32 స్థానాల్లో బరిలోకి దిగాలని చూడగా, ఓట్ల చీలికపై యోచించిన బీజేపీ పవన్ తో పొత్తు పెట్టుకుని 8 సీట్లు సర్దబాటు చేసింది. కానీ జనసేనకు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు.






కాగా, తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. చంద్రబాబు ఆ సమయంలో జైలులో ఉండటం, మరోవైపు కేవలం ఏపీపైనే ఫోకస్ చేస్తున్నారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలోనూ రాజమండ్రికి వెళ్లి పవన్ కళ్యాణ్.. నారా లోకేష్, బాలకృష్ణతో వెంట వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. చంద్రబాబుకు తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని, ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన మాత్రం ఒకటికిగా కలిసి పోటీ చేస్తాయని సైతం పవన్ కళ్యాణ్ ఇదివరకే స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్ ల భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో 2014 తరహాలో బీజేపీని కూడా కలుపుకోవాలా, లేక తమ రెండు పార్టీలే పొత్తు పెట్టుకుని పోటీ చేయాలా అనే అంశంపై వీరి మధ్య చర్చ జరిగే ఛాన్స్ ఉంది. బీజేపీ తమతో కలవకపోతే టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు మొదలుకానుంది. అదే సమయంలో వచ్చే ఎన్నికలకు మేనిఫెస్టోపై సైతం కీలకంగా చర్చించనున్నారు.


ఏం చర్చించారంటే.. 
పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య దాదాపు గంటపాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు పటిష్టత గురించి సమాలోచనలు చేసినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటు వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ దిశగా చర్చలు జరిపామన్నారు. చర్చలు సంతృప్తికరంగా జరిగాయని.. ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై చర్చించారు. టీడీపీ, జనసేన క్యాడర్ కలిసి పనిచేస్తుందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు మనోహర్.