TDP chief Chandrababu Naidu is likely to go to Delhi on Wednesday : ఏపీలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం ఢిల్లీకి వెళ్తున్నారు. బుధవారం రాత్రి ఆయన బీజేపీ ముఖ్యులతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పొత్తుల అంశంపై ఓ క్లారిటీకి చంద్రబాబు రానున్నారు.  టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తులు ప్రకటించుకున్నాయి. సీట్ల సర్దుబాటు చర్చలు నిర్వహిస్తున్నాయి. అయితే బీజేపీ కూడా ఈ కూటమిలో చేరుతుందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఏ వైపు నుంచి అడుగు ముందుకు పడటం లేదు. 


పొత్తులపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయా ?                              


ఇటీవల ఏపీలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించిన బీజేపీ..పొత్తులు కావాలంటే టీడీపీ సంప్రదించాలని వ్యాఖ్యానించింది. జనసేన పార్టీ తాము బీజేపీతో కలిసి ఉన్నామని అంటోందని.. టీడీపీ కూడా కలవాలనుకుంటే..జనసేనాధినేత అయిన చంద్రబాబుతో మాట్లాడాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత పొత్తులపై బీజేపీ నేతలు తమ అభిప్రాయాలను  హైకమాండ్ కు పంపారు. సీనియర్ నేతలంతా  రాత  పూర్వకంగా తమ అభిప్రాయాలను హైకమాండ్ కు పంపారు. 90  శాతం మంది నేతలు పొత్తులకు అనుకూలంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. 


టీడీపీతో పొత్తులపై అత్యధిక మంది బీజేపీ నేతలు అనుకూలం                             


టీడీపీతో పొత్తుపై బీజేపీ నేతలెవరూ మాట్లాడటం లేదు కానీ.. పురందేశ్వరి మాత్రం తాము జనసేనతో పొత్తులో ఉన్నామనే చెబుతున్నారు. టీడీపీతో పొత్తులపై హైకమాండ్ చెబుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకోవడమే మంచిదని బీజేపీ ముఖ్య నేతలు అనుకుంటున్నారు. ఒంటరిగా పోటీ చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ కూడా ఎన్డీఏలో చేరడం వల్ల కూటమి కూడా మరింత  బలోపేతం అవుతుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ కూడా కూటమిలో చేరుతుందన్న కారణంగానే.. సీట్ల సర్దుబాటు పైనల్ అయినా ఇంకా ప్రకటించడం లేదన్న అనుమానాలు కూడా రెండు పార్టీల నేతల్లో ఉన్నాయి. 


పొత్తులపై త్వరగా తేల్చేసే అవకాశం                                                    


చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత .. పొత్తుల విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పురందేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున పొత్తులపై త్వరగా తేల్చే అవకాశం ఉంది.