Tdp Appointed Two New Incharges: టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు వేళ టీడీపీ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) తాజాగా 2 నియోజకవర్గాలకు ఇంఛార్జీలను ఖరారు చేశారు. ప్రకాశం జిల్లా దర్శి (Darshi) నియోజకవర్గానికి హర్షిణి విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్, రైల్వేకోడూరు (Railwaykoduru) నియోజకవర్గానికి ముక్కా రూపానందరెడ్డిని ఇంఛార్జీలుగా నియమించారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. మరోవైపు, టీడీపీ ఎన్డీఏలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. అధికారిక ప్రకటనే తరువాయి. గురువారం రాత్రి జరిగిన చర్చల్లో ఇరు పార్టీలు ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం. ఇన్ని రోజులు సాగిన పొలిటికల్‌ సీరియల్‌కు ఇవాళ పుల్‌స్టాప్‌ పడనుంది. 2014 సీన్ ఆంధ్రప్రదేశ్‌లో పునరావృతం కానుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్నాయి. సీట్ల సర్దుబాటుపై కూడా ఓ అవగాహనకు వచ్చాయని సమాచారం. మూడు పార్టీలు కలిసి అధికారిక ప్రకటన చేయనున్నాయి. 175 అసెంబ్లీ సీట్లన్న ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీ కలిసి 30 స్థానాల్లో పోటీ  చేసే ఛాన్స్ ఉంది. 25 పార్లమెంట్‌ సీట్లలో 8 సీట్లలో ఈ రెండు పార్టీలు పోటీ చేస్తే... మిగిలిన 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. జనసేనకు ఇప్పటికే మూడు ఎంపీ స్థానాలు కేటాయించారు. అంటే ఐదు ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ పడనుంది. అదే టైంలో 24 ఎమ్మెల్యే సీట్లలో జనసేన పోటీ చేయనుంది. ఆరు సీట్లు బీజేపీకి కేటాయించనున్నారు. అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను బీజేపీజనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. మిగిలిన చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీకి దిగుతారు..


ఇప్పటికే టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా 118 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించారు. 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు, 24 స్థానాల్లో జనసేన అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. టీడీపీ - జనసేన - బీజేపీతో పొత్తుపై అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే తర్వాతి జాబితా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం ఢిల్లీకి వేర్వేరుగా చేరుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాత్రి పదిన్నరకు అమిత్‌షా, జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ చర్చల సందర్భంగా తమకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇవ్వాలని అమిత్‌షా ప్రతిపాదించారు. 370 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్నామని అందుకే తమకు అసెంబ్లీ సీట్లు పెద్ద ప్రాధాన్యం కాదని అందుకే ఎక్కవ లోక్‌సభ స్థానాలు ఇవ్వాలని అమిత్‌షా, నడ్డా ప్రతిపాదించారు. ఈ క్రమంలో లోక్ సభ సీట్ల కేటాయింపుపైనే సందిగ్థత నెలకొంది. దీనిపై ‌స్పందించిన చంద్రబాబు... నాలుగు స్థానాల్లో బీజేపీ సీట్లు కేటాయిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని తర్వాత ఒక రాజ్య సభ స్థానాన్ని ఇస్తామని చెప్పారు. అంతకంటే ఎక్కువ సీట్లు ఇస్తే ప్రత్యర్థులకు మేలు జరుగుతుందని వివరించారు. ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి బీజేపీ అగ్రనేతలు తీసుకెళ్లారు. పూర్తి సమీకరణల అనంతరం సీట్ల సర్దుబాటు, పొత్తుపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.


Also Read: Tirupati Assembly Constituency : టీడీపీ- జనసేన కూటమి నుంచి తిరుపతిలో పోటీ చేసేది ఎవరు? అధికార పార్టీకి గెలుపు కేక్‌వాక్‌ అవుతుందా?