MLC Kavitha : ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) దీక్షకు దిగారు. హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో భారత్ జాగృతి ఆధ్వర్యంలో కవిత దీక్ష చేశారు. నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాంతర రిజర్వేషన్లు అమలు చేసేలా విడుదల చేసిన జీవో నంబర్ 3ను రద్దు చేయాలన్నారు. ఈ దీక్షకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాగంటి గోపినాథ్ మద్దతు తెలిపారు.
మహిళా దినోత్సవం రోజు ధర్నా చేయాల్సి వచ్చింది : కవిత
ఇవాళ మహిళలకు రెండు పండుగలు.. ఒకటి మహిళా దినోత్సవం.. మరొకటి శివరాత్రి.. ఈరోజు మహిళల కోసం ధర్నా చేయడం పుణ్యమేనని కవిత విమర్శించారు. మహిళా లోకంలో చదువుకునే వాళ్ళు తక్కువ అంటే.. సర్కారీ నౌకరి సంపాదించేవాళ్లు మరీ తక్కువగా ఉంటారని చెప్పారు. 1996లో పీవీ నరసింహారావు మహిళల కోసం విద్యలో 33% రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేశారని ఆమె అన్నారు. కొత్త ప్రభుత్వం వస్తే.. పాత ప్రభుత్వంలోని తప్పులను సరిచేసి ప్రజలకు మంచి చేయాలి.. కాని, కాంగ్రెస్ అలా చేయడం లేదని మండిపడ్డారు కవిత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో డైరెక్ట్ గా దొరికిన వ్యక్తి అని. .ఈ కేసు నుంచి బయటపడాలని రేవంత్ కొట్లాడుతున్నాడని.. తన ఓటుకు నోటు కేసుపై ఉన్న శ్రద్ధ.. ఆడబిడ్డల సమస్యలపై శ్రద్ధ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.
ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలుచేస్తూ గత నెల 8న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్‌ను మార్కు చేయకుండా ఓపెన్, రిజర్వుడు కేటగిరీల్లో 100లో 33 శాతం(1/3) రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
రాజస్థాన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్లే
రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ దరియా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు సంబంధించిన నియామక ప్రక్రియలో ఈ మేరకు అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు నిబంధనలు -1996 ప్రకారం మహిళలకు ఓపెన్, రిజర్వుడు కేటగిరిల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిబంధన ఉంది. గ్రూప్ – 1 ఉద్యోగ ప్రకటనలో రోస్టర్ పాయింట్ 1 నుంచి తీసుకోవడంతో మహిళలకు ఎక్కువ పోస్టులు రిజర్వు అయ్యాయి.