YSRCP vs TDP: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా అంశం మరోసారి సంచలనంగా మారింది. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు ఓటర్ల జాబితాలోని అవకతవకలతో ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల సన్నాహాలపై ఏపీలో పర్యటిస్తున్న ఎన్నికల సంఘం అధికారులకు తమ ప్రజెంటేషన్ ఇచ్చాయి.
దొంగ ఓట్లపై పరస్పర ఫిర్యాదులు చేస్తున్న టీడీపీ, వైసీపీ
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య ఓట్ల పంచాయితీ కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలు మార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి పోటీ పోటీగా ఫిర్యాదులు చేశారు రెండు పార్టీల నేతలు.. ఇప్పుడు రెండు రోజుల పాటు రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి పోటీపోటీగా ఫిర్యాదులు చేసుకున్నారు వైసీపీ-టీడీపీ, జనసేన పార్టీల నేతలు.. దీంతో.. విజయవాడ వేదికగా ఎన్నికల కమిషన్ ముందు వైసీపీ-టీడీపీ పంచాయితీగా మారింది పరిస్థితి.. ఓట్ల తొలగింపు మీద పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు .
ఈసీ ప్రతినిధఉల్ని ఆధారాలతో కలిసిన ఇరు పార్టీల నేతలు
విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను టీడీపీ, జనసేన నేతలు కలిశారు.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య, బోండా ఉమా.. జనసేన నేతలు గాదె వెంకటేశ్వర్లు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్.. మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సహా పలువురు నేతలు సీఈసీ ప్రతినిధులను కలిశారు.. రాష్టంలో ఓట్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు టీడీపీ, జనసేన నేతలు. మరోవైపు.. వైసీపీ నేతలు కూడా సీఈసీని కలిశారు.. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు పేర్ని నాని, అబ్బయ్య చౌదరి తదితరులు ఎన్నికల అధికారులను కలిసిన వారిలో ఉన్నారు.. వారు కూడా ఓట్ల అక్రమాలపై సీఈసీకి ఫిర్యాదు చేశారు.
గతంలో ఢిల్లీలోనూ ఫిర్యాదులు
గతంలో ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. రాష్ట్రంలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించిందని ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో 40.76 లక్షలకు పైగా దొంగ ఓట్లు జాబితాలో చేర్పించారని ఫిర్యాదు చేశారు. ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాలలో ఓటరులుగా టీడీపీ సానుభూతిపరుల పేర్లు నమోదయ్యాయని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలో నివసిస్తున్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లు రాష్ట్రంలో కూడా నేతలు నమోదు చేయించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, కక్ష పూరితంగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారు.. వైసీపీ నేతలే దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారంటూ టీడీపీ కూడా పలు సందర్భాల్లో ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం విదితమే.