Tadipatri News : అనంతపురం జిల్లా తాడిపత్రిలో టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనున్న ఖాళీ స్థలంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భూమి పూజ చేశారు. దీంతో తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది.తాడిపత్రిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి మున్సిపాలిటీ అనుమతి లేదని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో నిరసనకు దిగారు. అన్ని అనుమతులు తీసుకునే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేశామని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు అంటున్నారు. వైసీపీ, టీడీపీ నాయకుల ప్రకటనల మధ్య ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఫకీరప్పతోపాటు తాడిపత్రి డీఎస్పీ చైతన్య హాజరయ్యారు. అయితే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు అనుమతి లేదంటూ టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. దీంతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో నియంత పాలన కొనసాగుతోందని చిన్న భవనం నిర్మించాలన్న మున్సిపల్ అనుమతి తప్పనిసరి అని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతి తీసుకోకుండా ఎలా నిర్మిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉద్రిక్తతల మధ్య తాడిపత్రి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
మాటల యుద్ధం
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటలు యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తాడిపత్రిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు ఎమ్మెల్యే ఎస్పీతో కలిసి గురువారం భూమి పూజ నిర్వహించారు. అయితే మున్సిపల్ శాఖ అనుమతి లేకుండా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మిస్తున్నారని, తనకు చెప్పకుండా భూమి పూజ చేయడం ఏంటని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖకు చెందిన స్థలమని, అన్ని అనుమతులు తీసుకున్నామని ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. పోలీసులు, ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ఆరోపణలు పట్టించుకోవడంలేదు. భూమి పూజ అనంతరం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మున్సిపల్ స్థలాలను జేసీ కుటుంబీకులే కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. వాటిలో జేసీ ప్రభాకర్ రెడ్డికి వాటాలు ఉన్నాయని ఆరోపించారు. తాడిపత్రి ఆయన జాగిర్ కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రభాకర్ రెడ్డి వర్సెస్ డీఎస్పీ
తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య వ్యవహారశైలిపై మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య పోరుబాట పట్టారు. ఆయన ప్రోద్భలంతోనే టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, దళిత నేతల్ని టార్గెట్ చేశారని ఆయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఎలాంటి కేసుకైనా రూ. లక్ష తీసుకుంటారని డీఎస్పీపై మండిపడ్డారు. డీఎస్పీ చైతన్య కూడా రాజకీయ పరమైన ఆరోపణలు చేయడంతో పరిస్థితి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ డీఎస్పీ చైతన్య అన్నట్లుగా మారింది. తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఉన్నతాధికారుల అనుమతితో తాను కోర్టును ఆశ్రయిస్తాయని డీఎస్పీ ప్రకటించారు. ఈ మాటల మంటలు ఇలా ఉండగానే పోలీసుల తీరుకు నిరసనగా జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లతో కలిసి సేవ్ తాడిపత్రి నినాదంతో ఇటీవల నిరసన చేశారు.
రాజకీయ వేధింపులు
రాజకీయంగా ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉండే నియోజకవర్గం తాడిపత్రి. ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు దళిత కౌన్సిలర్లపై దాడులు జరిగాయి. ఆ దాడుల్లో డీఎస్పీ చైతన్య ప్రమేయం ఉందని ఆ కౌన్సిలర్లు ఆరోపించారు. ఇటీవలి కాలంలో డీఎస్పీ చైతన్య ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్పినట్లుగా చేస్తున్నారని, టీడీపీ నేతల్ని రాజకీయంగా వేధిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇటీవల భారీ ర్యాలీ నిర్వహించి స్టేషన్ ముందు ధర్నాకు దిగడంతో కొన్ని గంటలపాటు హైటెన్షన్ కొనసాగింది. ఈ ఘటనతో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.