Case On Pawan :    జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు నమోదైంది. తాడేపల్లి పోలీసులు ఆయనను ఏ వన్‌గా పెట్టి.. ఆయన కారు డ్రైవర్‌ను ఏ 2గా ఖరారు చేసి కేసు నమోదు చేశారు. పవన్ కల్యాణ్ వల్ల తనకు బైక్ ప్రమాదం జరిగిందని తెనాలి మోరిస్ పేటకు చెందిన పి. శివ అనే వ్యక్తి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. పవన్‍పై IPC 336, రెడ్‍విత్ 177MV యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.


పవన్ నిర్లక్ష్యం వల్ల తాను కింద పడ్డానని తెనాలికి చెందిన శివ అనే వ్యక్తి ఫిర్యాదు


తెనాలి మోరిస్ పేటకు చెందిన శివ ఇచ్చిన ఫిర్యాదు కాస్త విచిత్రంగా ఉంది.  తాను  నవంబర్ 5వ తేదీన ఇప్పటం  రోడ్ మీద వెళ్తున్న సమయంలో పవన్ కల్యాణ్ కాన్వాయ్ వేగంగా వచ్చిందని... ఆ కాన్వాయ్‌లో మొదటి కారుపై వన్ కల్యాణ్‌పై కూర్చుని ఉన్నారని శివ ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఆ కారును అమిత వేగంతో డ్రైవర్ నడిపించారని శివ  .. అదే వేగంతో చాలా కార్లు వెళ్లాయి. ఈ కారణంగా  అదే రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న తాను కిందపడ్డానని ఫిర్యాదులో పేర్కొన్నారు.  తన ప్రమాదానికి కారణం పవన్ కల్యాణ్, అతని డ్రైవరేనని అతని పదో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకుక కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్.. ప్రధాని ఏపీ పర్యటనన నుంచి తెలంగాణకు బయలుదేరి వెళ్లిన తర్వాత బయటకు వచ్చింది.


ఇప్పటం పర్యటనకు పోలీసులు  అడ్డుకున్న క్రమంలో  కారుపై కూర్చుని వెళ్లిన పవన్ 
 
ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ అక్కడి ప్రజలకు అండగా ఉండేందుకు ఐదో తేదీన పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్లారు. మొదట ఆయన వాహనాలతో వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. అయితే పవన్ నడుచుకూంటూ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొంత దూరం పోయిన తర్వాత పోలీసులు వాహనాలకు అనుమతి ఇచ్చారు. అప్పుడు పవన్.. కారుపైకి ఎక్కి కూర్చుని వెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  జన సైనికులు ఆయన స్టైల్ సూపర్ అని పొగిడారు. అలా వెళ్లడం నిబంధనలను ఉల్లంఘించడం.. నిర్లక్ష్యమని ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు.


కిందపడిన ఐదు రోజుల తర్వాత ఫిర్యాదు చేసిన శివ - వెంటనే కేసు పెట్టిన పోలీసులు 


అయితే ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత తెనానికి చెందిన శివ అనే వ్యక్తి ఫిర్యాదు  చేయడం..  పోలీసులు కేసు నమోదు చేయడంపై జనసైనికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే శివ అనే వ్యక్తి.. ఫిర్యాదులో ఎక్కడా పవన్ కల్యాణ్ కారు ఢీ కొట్టిందని చెప్పలేదు.  వారి నిర్లక్ష్యం వల్ల తాను కిందపడ్డానని ఫిర్యాదు చేశారు. వేగంగా నడిపారని.. చెబుతున్నారు. హైవే మీద వాహనాలు వేగంగానే వెళ్తాయి. నిజంగా చట్టం అంగీకరించనివేగంతో వెళ్తే స్పీడ్ గన్‌తో రికార్డు చేసి ఫైన్ వేసి ఉండాల్సిందని జనసైనికులు అంటున్నారు. అసలు పి శివ అనే వ్యక్తి ఆ రోజు అక్కడ కింద పడ్డాడో లేదో కూడా ఎవరికీ తెలియదని.. ఊరికనే పవన్ కల్యాణ్‌ను ఏదో విధంగా కేసులో ఇరికించాడనికే ఇలాంటి ఫిర్యాదులు కృత్రిమంగా చేయిస్తున్నారని జనసైనికులు ఆరోపిస్తున్నారు.