Dadisetti Raja on Pawan : టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊడిగం చేయడమే పవన్ కల్యాణ్ ఉద్యోగమని ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అని పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. బాబు-పవన్ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పవన్ ఎదుగుదలకు కారణమైన చిరంజీవి తమ్ముడినని ఏనాడైనా చెప్పావా అని మంత్రి ప్రశ్నించారు. పవన్ - బాబులను అమిత్ షా కలవలేదంటేనే.. వీళ్ల స్థాయి ఏంటో తెలుసుకోవాలన్నారు. రంగా హత్యలో చంద్రబాబుకు సంబంధం లేదని ఏ ఒక్కరితోనైనా చెప్పించగలవా పవన్ కల్యాణ్ అని సవాల్ విసిరారు. కాపులకు ఇంత అన్యాయం చేసిన చంద్రబాబుకు ఊడిగం చేసే పవన్ ను కాపులెవరూ నమ్మరన్నారు.
గడప గడపకు అనూహ్య స్పందన
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో భారీ సంస్కరణలు, కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ద్వారా ప్రజలు దగ్గరకు వెళితే అనూహ్య స్పందన కనిపిస్తోందన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూశాక, ప్రజా ప్రతినిధులకు మరింత ప్రోత్సహకంగా ఉందన్నారు. ఒక రూపాయి అవినీతి లేకుండా, రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి తట్టుకోలేని ప్రతిపక్షాలు, వైసీపీ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నాయని మంత్రి రాజా విమర్శించారు. సీఎం జగన్ ప్రతిష్టను దిగజార్చేందుకు చంద్రబాబు అండ్ కో నిత్యం ఏదోరకంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నారా-నాదెండ్ల కుమ్మక్కై పవన్ కల్యాణ్ అనే శిఖండిని కలుపుకుని, జననేత అయిన జగన్ ని ఏదో రకంగా వెన్నుపోటు పొడుద్దామనే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే చిల్లర రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ ముగ్గురు కాదు కదా... ఇలాంటి వాళ్లు మూడు వందల మంది వచ్చినా వైఎస్ జగన్ ప్రజా బలాన్ని టచ్ చేయలేరన్నారు.
చిరంజీవికి అవమానం
"రాజకీయాల్లో, సినిమాల్లో చిరంజీవి ఎప్పుడూ అవమానపడలేదు. అవమానం అంటూ జరిగితే అది పవన్ కల్యాణ్ వల్లే జరిగింది. అది ఎప్పుడంటే పరిటాల రవి గుండు కొట్టించినప్పుడు, చిరంజీవి చంద్రబాబును కలవడానికి వస్తే, అధికారమదంతో చంద్రబాబు-పరిటాల రవి కలిసి చేసిన అవమానమే చిరంజీవి జీవితంలో పెద్ద అవమానం. నీ గుండు ఎపిసోడ్‌లో మాత్రమే చిరంజీవి అవమానం జరిగింది. మెగాస్టార్ గా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన చిరంజీవిని ఎవరూ అవమానించలేదు. తాజాగా ఆయన పుట్టినరోజున(ఆగస్టు 22న) మళ్లీ పవన్ కల్యాణ్.. అటువంటి మాటలు మాట్లాడి ఆయనను అవమానించారు". - మంత్రి దాడిశెట్టి రాజా
మళ్లీ సవాల్
పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో 175కు, 25 పార్లమెంట్ స్థానాల్లో 25కు పోటీ చేసే దమ్ము ఉందా? అని వైసీపీ సూటిగా ప్రశ్నిస్తోందని మంత్రి రాజా అన్నారు. పవన్ కు ఆ దమ్ములేదని విమర్శించారు. చంద్రబాబు చెబితే తప్ప, జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో చెప్పలేని పరిస్థితి అని ఎద్దేవా చేశారు. అలాంటి పవన్ వైసీపీపై విమర్శలు చేయడంలో అర్థంలేదన్నారు. ఏపీ ప్రజలు పవన్ కల్యాణ్- చంద్రబాబు విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకుంటున్నారని అన్నారు.
Also Read : Somireddy : ఏపీలో వైసీపీయేతర ప్రభుత్వం, పవన్ కల్యాణ్ కి సోమిరెడ్డి సపోర్ట్