Weather Updates: ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న బలమైన వేడిగాలుల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం పొడిగా మారింది. ఈ రోజు ఎండల తీవ్రత మరింత ఎక్కువైంది. ఉష్ణోగ్రతలు ఇప్పుడు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు కానుంది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, ఉత్తర దిశ నుంచి గాలులు వేగంగా వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో వాతావరణం మరికొన్ని రోజులపాటు పొడిగా మారుతుంది. ఓ వైపు మధ్యాహ్నం పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నా, రాత్రి వేళల్లో చలి ప్రభావం తగ్గలేదని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మధ్యాహ్నం ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖ నగరంలో ఉక్కపోత మరింత ఎక్కువైంది. 100 శాతం తేమ, ఎండ వేడితో చాలా ఉక్కపోత ఉంటుంది. విజయవాడ నగరంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. విజయవాడతో పాటుగా రాజమండ్రి, ఏలూరు కేంద్రాల్లోనూ ఉక్కపోత అధికం కానుంది. రానున్న మూడు రోజుల్లో 43 డిగ్రీలను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. నందిగామలో 38.5 డిగ్రీలు, అమరావతిలో 38.2 డిగ్రీలు, విశాఖపట్నంలో 37.5 డిగ్రీలు, కాకినాడలోనూ 37 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పగటి పూట వేడి అధికంగా ఉంటుంది. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు ఉన్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కోస్తా భాగల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. ఎండలు రానున్న పదిరోజుల్లో ఎక్కువ పెరుగుతాయి. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్తే గొడుగు తీసుకెళ్లాలని, కొబ్బరి బొండాలు, పళ్ల రసాలు తాగడం ద్వారా డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారని అధికారులు పేర్కొన్నారు. రోజుకు కనీసం 5 లీటర్ల వరకు మంచి నీళ్లు తాగాలని అధికారులు సూచించారు. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న వేడి గాలుల ప్రభావంతో ప్రకాశం, కర్నూలు, గుంటూరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఉక్కపోత ఎక్కువ అవుతుంది. కర్నూలులో 38.5 డిగ్రీలు, నంద్యాలలో 39.5 డిగ్రీలు, అనంతపురంలో 38.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్ (Telangana Temperature Today)
ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు భాగాలు, ఉత్తర భాగల్లో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మిర్యాలగూడలో కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో వేడి, ఉక్కపోత రోజురోజుకూ పెరిగిపోతోంది. రాష్ట్రంలోని తూర్పు ప్రాంతాలైన సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ, భద్రాద్రి, ములుగు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలతో వాతావరణం పొడిగా మారుతుంది. నల్గొండలో 40 డిగ్రీలు, భద్రాచలంలో 39 డిగ్రీలు, మహబూబ్ నగర్‌లో 38 డిగ్రీలు, హైదరాబాద్ లో 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్! వరుసగా తగ్గుతున్న పసిడి ధర, నేడు మరింతగా కిందికి - వెండి ధర ఎంతంటే