తెలంగాణలో రాజకీయ వాతావరణం మారిపోయిందని అభిప్రాయపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. ఇప్పుడు కాకుంటే తెలంగాణలో ఎప్పుడూ అధికారంలోకి రాలేమన్నారాయన. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సామన్య ప్రజలు చెబుతున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాసమస్యలపై పోరాటం ఉద్దృతం చేయాలన్నారు. 


మహిళా మోర్చ నేతలతో సమావేశమైన బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు. ప్రజాసమస్యలపై రాజీపడకుండా ఉద్యమాలు చేసి రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భాలను గుర్తు చేశారాయన. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రమే ఉదాహరణగా చెప్పుకొచ్చారు. తెలంగాణలో అదే మాదిరిగానే అధికారంలోకి రావాలన్నారు బండి సంజయ్‌. 


తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందన్న బండి సంజయ్.. నేతలంతా రెడీగా ఉండాలని మహిళా మోర్చా నాయకులకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల అంశంపై జాతీయ నాయకత్వం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటుందన్నారు. జాతీయ నాయకత్వం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నాయకుల పనితీరు, గెలిచే అవకాశమున్న నాయకులెవరు? అనే అంశాలపై అన్ని రకాల సర్వేలు నిర్వహిస్తుందిని తెలిపారు. గెలిచే వాళ్లకు మాత్రమే టిక్కెట్లు ఇస్తుందన్నారు. అందులో మహిళా మోర్చా నాయకులుంటే వాళ్లకు కచ్చితంగా టిక్కెట్లు వస్తాయని భరోసా ఇచ్చారు. 


అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మహిళా కోటా ఉంటుందన్నారు బండి సంజయ్‌. దీన్ని   దృష్టిలో పెట్టుకొని కష్టపడి పనిచేయాలన్నారు. దాదాపు రెండు గంటలపాటు మహిళా మోర్చ లీడర్లతో జూమ్‌లో మాట్లాడారు బండి సంజయ్‌. జిల్లాల వారీగా మహిళా మోర్చా పనితీరు, సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై చర్చించారు.  


50 శాతం మహిళా ఓటర్లు ఉన్న తెలంగాణలో మహిళా మోర్చ నేతలు కష్టపడితే అధికారం సాధ్యమే అన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా స్థానికంగా మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలన్నింటిపైనా ఎప్పటికప్పుడు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 


రాత్రి పూట నిర్ణయాలు తీసుకుని అమలు చేసే టైపు కేసీఆర్‌ అని ఎద్దేవా చేశారు బండి సంజయ్‌. 6 నెలల్లోపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దీటుగా ఎదుర్కొనేలా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మహిళా మోర్చా విభాగాలను పటిష్టం చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి జిల్లాలో కనీసం రెండు నియోజకవర్గాల్లోనైనా మహిళలకు టిక్కెట్లు ఇస్తే గెలిచేలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధిని గెలిపించడంలో మహిళా మోర్చా ప్రధాన పాత్ర పోషించాలని ఉత్సాహపరిచారు. 


ఇప్పటి వరకు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంఐఎం తప్ప ఎవరూ గెలవలేరనే భావన ఉందన్న బండి సంజయ్‌ దాన్ని పటాపంచలు చేయాలన్నారు.  అదే ఉద్దేశంతోనే తొలి ఎంపీ సదస్సు అక్కడ పెట్టామన్నారు. మలక్‌పేట, కార్వాన్, గోషామహల్ నియోజకవర్గాల్లో గతంలో గెలిచామన్న ఆయన.. మరి కష్టపడితే ఆ స్థానాన్ని ఎందుకు గెలవలేమో ఆలోచించాలన్నారు. 


కేసీఆర్ పాలనలో మహిళలు వివక్షకు గురవుతున్నారన్నారు బండి సంజయ్‌. గత కేబినెట్‌లో మహిళలకు ప్రాతినిధ్యం లేదని గుర్తు చేశారు. ఈసారి ఇద్దరు మాత్రమే ఉన్నారని తెలిపారు. వాళ్లు కూడా రబ్బర్ స్టాంపులుగా మారారన్నారు. మద్యం వల్ల పుస్తెలు తెగిపడుతున్నా కేసీఆర్ మనసు కరగడం లేదని ఆరోపించారు. కుటుంబాన్ని పోషించడం కోసం మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారి తరపున మీరంతా  గళమెత్తాలని మహిళా మోర్చా నేతలకు సూచించారు. 


మహిళా మోర్చా విభాగం తూతూ మంత్రంగా కార్యక్రమాలు చేయొద్దన్నారు బండి  సంజయ్‌. జిల్లాల్లో బాధ్యత తీసుకున్నప్పుడు పనిచేయాలే తప్ప ద్రోహం చేయొద్దని కోరారు. తక్షణమే జిల్లాలోని మండల కమిటీలన్నీ పూర్తి చేయాలన్నారు. ఒక్కో జిల్లా పదాధికారికి ఒక్కో మండలం బాధ్యత అప్పగించాలన్నారు. పని చేయని వ్యక్తులను పక్కనపెట్టండని ఆదేశించారు.


కేసీఆర్ ప్రభుత్వ మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లండని సూచించారు బండి సంజయ్‌. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి, అక్రమాలపై ప్రజలకు వివరించాలని సలహా ఇచ్చారు. మహిళా మోర్చా చేపట్టే కార్యక్రమాలు, పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాను ఉపయోగించాలన్నారు. ప్రతి మహిళా మోర్చా నాయకులు తప్పనిసరిగా ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ అకౌంట్లు ప్రారంభించి యాక్టివ్‌గా పాల్గొనాలన్నారు.