Supreme Court Verdict on Chandrababu Quash Petition : స్కిల్ డెలవప్‌మెంట్ కేసులో తనపై చట్ట విరుద్ధంగా కేసు నమోదు చేశారని తనకు 17ఏ సెక్షన్ వర్తిస్తుందని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం ఇవ్వనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ తీర్పును ఇవ్వనుంది. గతంలో విచారణ పూర్తయిన తర్వాత అక్టోబర్ 20వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు. సుదీర్ కాలంగా రిజర్వ్ లో ఉన్న తీర్పును మంగళవారం సుప్రీంకోర్టు ఇవ్వనుంది.
స్కిల్ కేసులో తనకు 17ఏ వర్తిస్తుందన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సీఐడీ కేసు పెట్టింది. మొదట ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినప్పటికీ అర్థరాత్రి అరెస్టు చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు నమోదు చేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తర్వాత హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ వచ్చింది. కనీస సాక్ష్యాధారాలను కూడా సీఐడీ చూపించలేకపోయిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీనిపైనా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
క్వాష్ పిటిషన్ పై తీర్పు అక్టోబర్ 18వ తేదీన రిజర్వ్
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు అక్టోబర్ 18వ తేదీన రిజర్వ్ చేసింది. అప్పటి నుంచి తీర్పు పెండింగ్ లో ఉంది. చంద్రబాబుపై ప్రభుత్వం పెట్టిన ఇబ్బడిమబ్బడి కేసుల గురించి అటు ఏసీబీ కోర్టులో.. ఇటు హైకోర్టులో.. సుప్రీంకోర్టులో అదే పనిగా విచారణకు వస్తున్నాయి. కానీ క్వాష్ పిటిషన్ పై తీర్పు రాని కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. చివరికి చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ కూడా ఈ కారణంగానే వాయిదా పడింది.
క్వాష్ పిటిషన్ తీర్పుపై ఉత్కంఠ
క్వాష్ పిటిషన్ తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే.. ఆయన పై పెట్టి నకేసులన్నీ అక్రమం అని తేలుతాయి. కోర్టుల్లో ఉన్నవన్నీ తేలిపోతాయి. వాటికి విచారణ అర్హత కూడా ఉండదు. ఒక వేళ చంద్రబాబుకు 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు చెబితే మాత్రం విచారణ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్స్ లభించాయి. ఒక్క ఫైబర్ నెట్ కేసులో గతంలో హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. క్వాష్ పిటిషన్ పై తీర్పు తర్వాత ఆ పిటిషన్ పై విచారణ అవసరమో లేదో తేలే అవకాశం ఉంది.