Chandrababu in Vote For Note Case: తెలంగాణలోని ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ.. ఆళ్ల రామక్రిష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ధర్మాసనం కొట్టేయడమే కాకుండా ఆళ్ల రామక్రిష్ణా రెడ్డిని కూడా మందలించింది. ఆ విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించింది. 


తెలంగాణలో పదేళ్ల క్రితం జరిగిన ఓటుకు నోటు కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చాలని కోరుతూ మంగళగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి గతంలో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణను సీబీఐకు అప్పగించాలని, తద్వారా కేసులో పారదర్శకత పెరుగుతుందని మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇప్పటికే సుప్రీంకోర్టు ఎన్నోసార్లు విచారణ జరిపి వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా వాటిని కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.


ఆళ్లకు సుప్రీంకోర్టు వార్నింగ్


జస్టిస్ సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఈ ఆళ్ల పిటిషన్లను తాజాగా విచారించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆళ్లను మందలించింది. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను వాడుకోవద్దని ఆళ్ల రామకృష్ణారెడ్డిని హెచ్చరించింది. ఆధార రహిత విషయాలను తీసుకొచ్చి కోర్టుతో తమాషాలు చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్‌ రాజకీయ నేపథ్యంపై కూడా ఆరా తీసిన ధర్మాసనం.. 2014 నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఆళ్ల ఉన్న పార్టీ ప్రత్యర్థిగా ఉందని న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టుకు తెలిపారు.


ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో వేరే పిటిషన్లు కూడా ఉన్నాయని ఆళ్ల తరఫు న్యాయవాది ఓ జాబితా పెట్టగా.. ఆ కేసులకు, ఇప్పుడు వాదనలు జరుగుతున్న కేసులకు సంబంధం లేదని సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. కేసుల జాబితా చూశాక పిటిషనర్‌ రామకృష్ణారెడ్డిపై ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు కనపడటం లేదని తెలిపింది. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి, సత్తా చాటుకోవాలి తప్ప రాజకీయ కక్షల కోసం కోర్టులకు రావద్దంటూ సుప్రీంకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు.