Supreme Court Orders To Stop Illegal Sand Mining In AP: ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు (Ap Sand Mining) వెంటనే నిలిపేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు నిర్దేశించింది. అటు, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రదేశాలను ఇప్పటికే గుర్తించారని.. అక్కడ తవ్వకాలు నిలిపేశారా.? లేదా.? అనేది తనిఖీలు చేపట్టాలని సూచించింది. కాగా, రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపేయాలని.. అనుమతి ఉన్న చోట యంత్రాలు కూడా ఉపయోగించొద్దని ఏప్రిల్ 29వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే, ఆ తర్వాత కూడా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపట్టారని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు నాగేంద్రకుమార్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా అక్రమ తవ్వకాలు జరిగిన తేదీ, టైం, ఇసుక రవాణా చేస్తోన్న వాహనాల ఫోటోలను న్యాయస్థానం ముందు ఉంచారు.
అక్రమ తవ్వకాలపై సుప్రీం ఆగ్రహం
దీనిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకున్నామన్న ప్రభుత్వ వాదనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. 'మీరు చేపట్టిన చర్యలన్నీ కాగితాలపైనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో కనిపించవు.' అంటూ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా అసహనం వ్యక్తం చేశారు. వెంటనే అక్రమ తవ్వకాలు నిలిపేయాలని.. అధికారులు ఆ ప్రాంతాలకు వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు.