Jyotika About Bollywood: పెళ్లికి ముందు ఎంతో స్టార్‌డమ్ సంపాదించినా.. పెళ్లయిన తర్వాత చాలామంది హీరోయిన్స్ తమ ఫ్యామిలీ లైఫ్‌తో బిజీ అయిపోయారు. అలాంటి వారిలో జ్యోతిక కూడా ఒకరు. హీరో సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిక.. కొన్నాళ్ల క్రితం తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు. ఇక తమిళంలో మాత్రమే కాకుండా హిందీ నుంచి కూడా తనకు భారీగా ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్‌లో రీఎంట్రీపై జ్యోతిక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 27 ఏళ్ల నుంచి తనకు ఒక్క హిందీ ఆఫర్ కూడా రాలేదని బయటపెట్టారు.


బ్యాక్ టు బ్యాక్..


సూర్యను పెళ్లి చేసుకోవడంతో సౌత్ ఇండియాకు కోడలుగా వచ్చారు జ్యోతిక. కానీ అసలైతే జ్యోతిక పుట్టి పెరిగింది ముంబాయ్‌లోనే. అందుకే తన యాక్టింగ్ కెరీర్‌ను ఒక హిందీ సినిమాతో ప్రారంభించారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘డోలీ సజా కే రఖ్నా’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు జ్యోతిక. ఆ తర్వాత వెంటవెంటనే తనకు తమిళంలో అవకాశాలు రావడం మొదలయ్యింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ‘షైతాన్’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జ్యోతిక.. రాజ్‌కుమార్ రావు నటించిన ‘శ్రీకాంత్’లో ఒక సౌత్ ఇండియన్ అమ్మాయిగా ప్రేక్షకులను పలకరించనున్నారు. దానిపై ఆమె స్పందించారు. ‘‘నాకు ఈ సినిమాలో సౌత్‌తో కనెక్షన్ ఉంది. నాకు సౌత్ అంటే చాలా అభిమానం, ప్రేమ ఉన్నాయి. సౌత్‌కు చెందిన వ్యక్తి బయోపిక్‌తో నా ప్రయాణాన్ని మళ్లీ ప్రారంభించడం సంతోషంగా ఉంది’’ అన్నారు జ్యోతిక.


షిఫ్ట్ అయ్యాను..


‘‘నాకు హిందీ సినిమాల నుంచి ఒక్కసారి కూడా అవకాశం రాలేదు. నేను 27 ఏళ్ల క్రితం సౌత్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యాను అప్పటినుంచి కేవలం సౌత్ సినిమాల్లో మాత్రమే నటిస్తూ ఉన్నాను. నా మొదటి హిందీ సినిమా థియేటర్లలో అంతగా ఆడలేదు. మనకు మరిన్ని ఆఫర్లు రావాలంటే మొదటి సినిమా థియేటర్లలో సక్సెస్ అవ్వాలి. కానీ అలా జరగలేదు. నేను హిందీలో నా కెరీర్‌ను ప్రారంభించినప్పుడు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌజ్‌లతో కలిసి పనిచేస్తున్న అప్‌కమింగ్ నటీమణులు ఎంతోమంది ఉన్నారు. నా సినిమాను కూడా పెద్ద నిర్మాణ సంస్థే నిర్మించింది కానీ అది మంచిగా రన్ అవ్వలేదు. నా అదృష్టంకొద్దీ నేను అప్పటికే సౌత్ సినిమాను సైన్ చేసి బాలీవుడ్ నుంచి డైవర్ట్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చారు జ్యోతిక.


అంతా కొత్తగా..


‘‘తమిళంలో కూడా నా మొదటి సినిమా అంతగా ఆడలేదు. కానీ నా పర్ఫార్మెన్స్ నచ్చి నాకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అలా రెండు ఇండస్ట్రీల మధ్య చాలా తేడా ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ మేకర్స్ అంతా నేను సౌత్ ఇండియన్ అనుకొని, నాకు హిందీ సినిమాల్లో నటించడం ఇష్టం లేదని ఫిక్స్ అయ్యారు. నాకు హిందీ సినిమాలు చేయడం ఇష్టం లేదని కాదు.. కానీ ఇన్నేళ్లలో నాకు ఒక్క ఆఫర్ కూడా రాలేదు. చాలా ఏళ్ల తర్వాత నాకు హిందీలో మాట్లాడడం కూడా కొత్తగా అనిపించింది. ముందు రెండు రోజులు చాలా ఇబ్బందిగా అనిపించింది. మొదటి రోజు అయితే చాలా ఘోరంగా యాక్ట్ చేశాను. అసలు నేను నిజంగానే మళ్లీ బాలీవుడ్‌కు వచ్చానా అని గిల్లి చూసుకున్నాను’’ అని నవ్వుతూ చెప్పారు జ్యోతిక.



Also Read: బ్యాడ్‌న్యూస్‌ చెప్పిన విశ్వక్‌ సేన్‌ - మళ్లీ వాయిదా పడిన 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి', కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే