Elections 2024 : ఏపీ ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ మరో లేఖ రాసింది. జనవరిలో ప్రారంభించిన పథకాలకే ఇప్పటి వరకు నగదు ఇవ్వని మీకు.. ఇప్పుడు ఒకే సారి ఇంత నగదు ఎలా వచ్చిందని ఈసీ ప్రశ్నించింది. ఈ రోజే నగదు ఇవ్వకపోతే ఏమవుతుందని .. మధ్యాహ్నం 3 గంటల లోపు సమాధానం ఇవ్వమని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.
ఎన్నికల సంఘం ఇప్పటికే పోలింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే నగదు జమ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలపై కొందరు లబ్దిదారులు హైకోర్టుులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్.. ఒక్క రోజు నగదు జమ చేసకోవడానికి అనుమతి ఇచ్చారు. శని, ఆది, సోమవారాలు బ్యాంకులకు సెలవు. పోలింగ్ కు రెండు రోజుల ముందు ఎలాంటి జమలు ఉండకూడదు. అందుకే శుక్రవారమే లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాలనుకున్నారు. ప్రభుత్వం వద్ద ఎన్ని నిధులు ఉన్నాయో స్పష్టత లేదు. రాత్రి తొమ్మిది గంటలకు హైకోర్టు నుంచి అనుమతి లభిస్తూ ఉత్తర్వులు ఇచ్చినా ఉదయం లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయలేకపోయారు.
ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న నిధులు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలంటే ముందు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఉండాలి. ఎక్కువ పథకాలకు ఇచ్చిన నిధులు గత ఆర్థిక సంవత్సానికి చెందినవి. అప్పుడు ఇచ్చిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఇప్పుడు చెల్లవు. మరో సారి ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ అడ్డంగా ఉంది. అనుమతుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆలస్యమవుతోంది. ఈ లోపు కొంత మంది న్యాయవాదులు హైకోర్టు డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించారు.
అదే సమయంలో ఈసీ హైకోర్టు ఈ ఒక్క రోజు జమ కు అవకాశం కల్పించినప్పటికీ.. అధికారంగా ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. పైగా.. మూడు గంటలలోపు తాము వ్యక్తం చేసిన సందేహాలకు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే ఉద్దేశపూర్వకంగా నిధులను ఆపి.. ఇప్పుడు ఓటింగ్ కు ముందు జమ చేస్తున్నారని ఈసీ అనుమతిస్తోంది. బటన్లు నొక్కినప్పుడు ఎందుకు జమ చేయలేదు.. అప్పుడు లేని నిధులు ఇప్పుడు ఎలా వచ్చాయో చెప్పాలని కోరింది. అదే సమయంలో గతంలో బటన్లు నొక్కిన ఎన్ని రోజులకు డబ్బులు జమ చేసేవారో కూడా చెప్పాలని ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశాలు, హైకోర్టు విచారణ ఇవన్నీ పూర్తయ్యే లోపు బ్యాంకు సమయం ముగిసిపోతుందని వైసీపీ వర్గాలు అందోళన చెందుతున్నాయి. పథకాల నిధులన్నీ పెండింగ్ లో ఉండటం.. ఇలా వివాదం అవుతుందని తెలిసి కూడా ముందుగానే జమ చేయకపోవడం సమస్యగా మారుతోంది.