AP G.O No 1 Supreme Court :    జీఓ నెంబర్ 1పై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ  ముంగించింది. జీవో 1 పై ఇటీవల ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.  హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్‌ చేసింది. దీనిపై సీజేఐ జస్టిస్ డివై చంద్రచుడ్, పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం నేడు విచారించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్‌పై జోక్యం చేసుకోబోమని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం చేపడుతుందని ధర్మాసనం వెల్లడించింది. ఈ నెల 23న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపట్టాలని సీజేఐ సూచించారు. వాద ప్రతివాదులు ఇరువురూ... అన్ని అంశాలను డివిజన్‌ బెంచ్‌ ముందు ప్రస్తావించుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. 


అన్ని అంశాలు ఓపెన్‌గా ఉంచుతున్నామని సీజేఐ ధర్మాసనం వెల్లడించింది. కేసు మెరిట్స్‌‌పై ఇప్పుడు ఎలాంటి విచారణ చేపట్టడం లేదని సీజేఐ పేర్కొంది. ఈ కేసులో శీతాకాల సెలవుల్లో ఉన్న ధర్మాసనం విచారణ పరిధిపై అభ్యంతరం లేవనెత్తుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది పేర్కొన్నారు. హైకోర్టు ఇంతకు ముందు విచారణలో ఇరవై మూడో తేదీ వరకూ ఏపీ హైకోర్టు జీవో నెంబర్ 1 పై  స్టే ఇచ్చి 20వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది. అయితే అసలు శీతాకాలం సెలవుల్లో హైకోర్టు ఈ పిటిషన్ విచారణే చేపట్టకూడదని ఏపీ ప్రభుత్వ భావన కావడంతో సుప్రీంకోర్టుకెళ్లారు.  23వ తేదీన ఏపీ హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరగనుంది. అక్కడ ప్రభుత్వం అనుకున్న విధంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు.


టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరులో నిర్వహించిన సభల్లో తొక్కిసలాటతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. దీని ద్వారా రోడ్ల పైన సభలు - ర్యాలీల నిర్వహణ పైన ఆంక్షలు విధించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో పైన రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆ పిల్ విచారణ సమయంలో కీలక వాదనలు జరిగాయి. పిల్ ను విచారించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ జీవో నెంబర్ 1 ను ఈ నెల 23వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. 


ఈ జీవో ఇచ్చిన తర్వాత పూర్తిగా విపక్షాలను అడ్డుకునే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేసిందని వివిధ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. . వేల మంది పోలీసులను ప్రయోగించి..  చంద్రబాబు పర్యటనలను అడ్డుకున్నారని అదే సమయంలో అధికార పార్టీ భారీ ర్యాలీలు నిర్వహించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పైగా పోలీసులు భద్రత కల్పించారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.  త్వరలో లోకేష్, పవన్ యాత్రలు చేయబోతున్నారు. లోకేష్ పాదయాత్రకు అనుమతి కోసం లేఖ పంపినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు.  ఈ క్రమంలో సీజేఐ నేతృత్వంలో జరిగే విచారణ కీలకం కానుంది.