Andhra Pradesh News | న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (Telangana)లో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది. ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెరుగుతాయని, రిజర్వేషన్లు పెంచినా.. మహిళలకు అధిక సీట్ల కేటాయింపులతోనూ ఇబ్బంది ఉండదని భావించిన పార్టీలకు నిరాశే ఎదురవుతోంది.
నియోజకవర్గాల పునర్ విభజనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఏపీ విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని పిటిషనర్ పురుషోత్తం రెడ్డి కోరారు. జమ్మూకశ్మీర్‌లో పునర్విభజన కారణంగా ఆ సమయంలో ఏపీ విభజన చట్టంలోని అంశాలను పక్కన పెట్టారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పిటిషన్లను విచారణకు అనుమతిస్తే పలు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల విభజన లాంటి మరెన్నో పిటిషన్లు దాఖలు అవుతాయని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్ విభజన అంశానికి తెరపడింది. ఇప్పట్లో ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్ విభజన లేదని స్పష్టమవుతోంది.