ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నవంబర్ 9కు విచారణ వాయిదా వేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ముందస్తు బెయిల్ పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం శుక్రవారం బెయిల్ పిటిషన్ పై విచారించింది. తొలుత నవంబర్ 8కు వాయిదా వేయగా, చంద్రబాబు తరఫు న్యాయవాదుల విజ్ఞప్తితో నవంబర్ 9కు వాయిదా వేసింది. అప్పటివరకూ పీటీ వారెంట్ పై యథాతథ స్థితి కొనసాగించాలని, చంద్రబాబును అరెస్ట్ చెయ్యొద్దని సుప్రీం ఆదేశించింది. కాగా, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేయగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


క్వాష్ పిటిషన్ పై తీర్పు ఆ రోజే


మరోవైపు, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై నవంబర్ 8న తీర్పు ఇస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే ఇరు వర్గాలు వాదనలు ముగియగా తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. స్కిల్ స్కాం కేసు తర్వాతే ఫైబర్ నెట్ సంగతి చూస్తామని స్పష్టం చేసింది.


మరో ఎదురు దెబ్బ


అటు, స్కిల్ స్కాం కేసులోనూ చంద్రబాబుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన లీగల్ ములాఖత్ ల పెంపు పిటిషన్ విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంపై న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. సరైన లీగల్ ఫార్మాట్ లో పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లకు న్యాయమూర్తి సూచించారు. ప్రతివాదుల పేర్లు లేనందున ప్రస్తుతం విచారణ అవసరం లేదని పిటిషన్ ను కొట్టేసింది. దీంతో చంద్రబాబు లాయర్లకు రోజుకు ఒకసారి మాత్రమే ములాఖత్ ఉండనుంది. కాగా, వివిధ కేసుల్లో విచారణ ఉన్నందున రోజుకు మూడుసార్లు ములాఖత్ పెంచాలని చంద్రబాబు తరఫు లాయర్లు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. 


అసలేంటీ ఫైబర్ నెట్ స్కాం.?


AP స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL)లో టెండర్ కేటాయింపు దశ నుంచి ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు అనేక అవకతవకలు జరిగాయని, ఇది ప్రభుత్వానికి గణనీయమైన నష్టానికి దారి తీసిందని CID ఆరోపించింది. పర్యవసానంగా, ఈ గవర్నెన్స్ అథారిటీ మాజీ సభ్యుడు ఎస్.వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్ర (ఐఎన్‌సీఏపీ) సీఎండీ కె. సాంబశివరావు, టెరాసాఫ్ట్‌వేర్ ఎండీ తుమ్మల గోపీచంద్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కంపెనీతో సహా పలువురిపై సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిందని ఐఏఎన్ఎస్ నివేదిక పేర్కొంది. టెండర్లలోనే కాకుండా నాసిరకం పరికరాలతో ప్రజాధనం దోపిడీ చేశారని సీఐడీ అధికారులు ఆరోపించారు. 2015 నుంచి 2018 వరకూ చంద్రబాబు హయాంలోనే ఈ కుంభకోణం జరిగిందని, రూ.114 కోట్లకు పైగా ప్రజాధనాన్ని లూటీ చేశారని అభియోగాలు మోపారు. 2021లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. బ్లాక్ లిస్టులో ఉన్న టెరా కంపెనీకి అప్పట్లో టెండర్ కేటాయించినట్లు చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు.