మీరు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని బ్యాంకులో కొదవబెట్టిన తానే విడిపిస్తానని ఇలా ఎన్నో మాయమాటలతో మీ అందర్నీ మోసం చేసిన చంద్రబాబు మాటలు మళ్లీ నమ్మొద్దని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు మహిళలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో ఆరు గ్రామాలకు సంబంధించిన డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ పథకంలో భాగంగా ఆసరా చెక్కుల పంపిణీ చేశారు మంత్రి ధర్మాన.  ఈ కార్యక్రమంలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ అన్ని బాధ్యతలు ఇంటి ఇల్లాలే చూడాలని అటువంటి మహిళల చేతులు ఆర్థికంగా బలోపేతమైతేనే ఆ కుటుంబం అన్నింటా ఆర్థిక సాధికారత చెందుతుందన్నారు. ఆర్థిక లబ్ధి అందించేందుకు, డ్వాక్రా సంఘాలు నిలదొక్కుకునే౦దుకు, పునరుజ్జీవం పొందేందుకు వైసీపీ ప్రభుత్వం మూడు విడతలలో ఆసరా పథకం ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత అందిస్తుందన్నారు. శ్రీకాకుళం మండలం సింగుపురంలో.. భైరి, కరజాడ, కృష్ణప్పపేట, సింగుపురం, తండెంవలస, సానివాడ గ్రామాలకు చెందిన ఆసరా పథకం లబ్దిదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న కాలంలో మేలు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుంటే మీ చేయిని మీరే నరుకున్న వారు అవుతారు. మీ కొంగున డబ్బు ఉంటే మీ వెంటే యజమాని కలిసి నడుస్తారని, ఆ ఇళ్లు ఆనందంగా ఉండేలా ఆర్థిక సాధికారితకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇది ఇష్టం లేని కొంతమంది ఈ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారన్నారు. శత్రువు ఎక్కడో లేరని, మీ ఇంట్లోనే ఉన్నారని, వీరిపట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 


మీరు కూర్చున్న కొమ్మను మీ చేతులతోనే నరుక్కుంటారో.. మీకు మేలు చేసే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటారో మీ చేతుల్లోనే ఉందంటూ మహిళలను ఉద్దేశించి ధర్మాన మాట్లాడారు. ధర్మాన ప్రసాదరావు ఓడిపోతేనో.. జగన్ ముఖ్యమంత్రిగా అధికారం లేకపోతే జరిగే నష్టమేదీ ఉండదని, మీ సంక్షేమాన్ని కోరే ప్రభుత్వాన్ని మీరు ఓటేసి అధికారంలోకి తెచ్చుకోకపోతే మొదటి దెబ్బ తగిలేది మహిళలకేనని ప్రతి మహిళా అర్ధం చేసుకోవాలని ధర్మాన హితవు పలికారు. మీ పేరిట డబ్బులు జమ చేస్తూ మీ కుటుంబానికి ఆసరాగా ఉంటున్న ముఖ్యమంత్రి జగన్ డబ్బు వృధా చేస్తున్నారని కొంతమంది టీడీపీ నేతలు, చంద్రబాబు ఈ ప్రభుత్వ పథకాలు తప్పు అని ప్రచారం చేస్తున్నారని, వైకాపా ప్రభుత్వం చేస్తోంది తప్పా? ఆర్థిక ఆసరా ఇవ్వడం తప్పా ? ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీచే ఓటు వేయించుకోవడం కోసం చంద్రబాబు ఈ పథకాలు వేస్ట్ అని అంటున్నారని, ఇటువంటి వారి మాటల మాయలో పడొద్దన్నారు. ప్రజలకు అండగా ఉంటూ సంక్షేమ పథకాలు అమలు చేయడం వైసీపీ
ప్రభుత్వం తప్పా ? ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహించిన వ్యక్తులను, పిల్లల అభివృద్ధిని కుటుంబ స్థితిగతులను అర్ధం చేసుకోకుండా వ్యవహరిస్తున్న కొంతమంది మగవారిని ఉద్దేశించి నేను మాట్లాడిన వ్యాఖ్యలను సైతం కొంతమంది వక్రీకరిస్తూ నాపై బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని, అటువంటి మాటలను పట్టించుకోనని, ఇల్లు, ఇల్లాలి పట్ల బాధ్యత లేని వ్యక్తులను అలా కాక ఇంకేమనాలని ధర్మాన పేర్కొనడంతో మహిళ లంతా ఒక్కసారి గొల్లున నవ్వారు. 


తనకు ప్రజలిచ్చిన అధికారంతో మహిళలతో సహా అన్ని వర్గాల ఆర్ధిక సాధికారత చేకూరే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మీ అందరి ఆశీర్వచనంతో తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే రాజన్న పక్కన ఫోటోనై మీ అందరి గుండెల్లో నిలిచిపోవాలన్నదే ఆకాంక్షతో పనిచేస్తు న్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆలోచనలను అర్ధం చేసుకోవాలని మంత్రి ధర్మాన అన్నారు. మీకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు అండగా నిలవాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే సెంటు భూమి కూడా మీకు దక్కదని, చాలా పరిశీలన చేసిన తర్వాత పథకాలు ప్రవేశపెట్టాం. ఒక కుటుంబం ఎవరి చేతిలో బాగు పడుతుందో, సమాజంలో గౌరవం పెరుగుతుందో అన్నది చూడాలి. ఇంట్లో ఉన్న ఇల్లాలి వల్లనే సాధ్యం. అలాంటి కుటుంబాలను వేగంగా అభివృద్ధి చేయాలి అని సీఎం జగన్ మహిళలను బలవంతులు చేయాలని తలచి పథకాలు వారి పేరు మీదనే ఇస్తున్నాం. మహిళలను ఆర్థికంగా బలపరిచే చర్యలు చేపట్టాం. కొంతమంది సీఎం జగన్ చేస్తున్న మంచి నచ్చక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అవేవీ మీరు పట్టించుకోకండి. నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి అంటున్నారు. ఇది తగదు. ధరల విషయమై పక్కనున్న రాష్ట్రాలతో పోల్చి చూడండి. అవి కేంద్ర పరిధిలో ఉండేవి.


"మీ చేతులకు సీఎం జగన్ శక్తిని ఇచ్చారు. అవమానాలు పడకుండా ఉండేందుకు, మీరు బ్యాంకు మెట్లు ఎక్కకుండా ఉండేలా 4 దఫాలలో రుణాలు చెల్లిస్తా అని చెప్పి ఇప్పుడు మూడో విడత అందిస్తున్నాం. చంద్రబాబులా మాయమాటలు చెప్పలేదు జగన్.. నడుస్తున్నప్పుడే చెప్పారు, ఇప్పుడు చేస్తున్నారు. ఇది గిట్టని వాళ్ళు జగన్ డబ్బులు వృథా చేస్తున్నారు అని ప్రచారం చేస్తున్నారు.. అంటే మీ కుటుంబ గౌరవం పెంచడం తప్పా? అప్పులు ఊబిలో ఉండే మిమ్మల్ని బయటకు తీసుకు రావడం తప్పా ? మూడున్నర సంవత్సరాలుగా మీరు తీసుకుంటున్న పథకాల కోసం ఒక్కరికైనా లంచం ఇచ్చారా ? లేదు కదా, ఈ మార్పు చూసి చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. మీకు సహాయం చేసిన ప్రభుత్వానికి మీరంతా అండగా ఉండాలి." - మంత్రి ధర్మాన