"నేను పార్టీ మారడంలేదు, జగన్ తోనే ఉంటా, మేకపాటి కుటుంబానికి జగన్ ఎంతో గౌరవం ఇచ్చారు, నాపై వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లే." అంటూ ఏబీపీ దేశంతో మాట‌్లాడుతూ వివరించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. తాను పార్టీ మారుతున్నానని ప్రచారం చేసేవారంతా వీధికుక్కలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


ముగ్గురు పోతే ఏంటి..?
ఏపీలో వైసీపీకి ఎదురేలేదని అన్నారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. ముగ్గురు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన నెల్లూరు జిల్లాలో పార్టీకి జరిగే నష్టమేమీ లేదని అన్నారాయన. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ జిల్లాలో క్లీన్ స్వీస్ చేస్తుందని చెప్పారు. పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు శ్రీరామరక్ష అని అన్నారు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి. 


ఎందుకీ పుకార్లు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన సంగతి తెలిసిందే. వారితోపాటు మరికొందరు కూడా పార్టీ మారబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ వాట్సప్ లో ఓ పోస్టింగ్ హల్ చల్ చేసింది. దానిపై వెంటనే ఎమ్మెల్యే ప్రసన్న రియాక్ట్ అయ్యారు. తన చివరి రక్తపు బొట్టు వరకూ జగన్ కోసమేనని చెప్పారు ప్రసన్న. తనపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రసన్నతోపాటు, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అటు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై పార్టీ వేటు వేయడంతో ఆయన సోదరుడి కుమారుడు విక్రమ్ రెడ్డి కూడా పార్టీ మారతారని అన్నారు. కానీ అది కూడా వట్టి పుకారేనని ఖండించారు విక్రమ్ రెడ్డి. తప్పుడు ప్రచారం చేసేవాళ్లంతా వీధి కుక్కలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


తమ బాబాయ్ చంద్రశేఖర్‌ రెడ్డి వైసీపీని, అలాగే ఇంటి పేరు వదిలేసి వెళ్తే ఆయన శక్తి ఏంటో ఆయనకు తెలిసి వస్తుందన్నారు విక్రమ్ రెడ్డి. పార్టీ లైన్‌ దాటితే ఎవరిపైన అయినా చర్యలు తప్పవని చెప్పారు. ఇప్పుడు.. ఎప్పుడూ.. సీఎం జగన్ తోనే మా ప్రయాణం అని అన్నారు. జగన్ ని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేకే టీడీపీ తన అనుకూల మీడియాను అడ్డుపెట్టుకుని ప్రచారం చేస్తోందని చెప్పారు. టీడీపీ, ఎల్లో మీడియా ఎవరు కలిసొచ్చినా సరే.. ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్న సీఎం జగన్‌ స్థానాన్ని చెరపలేరన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఫలితం లేదన్నారాయన. 


ఎంతమంది ఖండించాలి..
వైసీపీ బహిష్కరించిన ఎమ్మెల్యేలు, టీడీపీలోని కొంతమంది నేతలు కూడా పార్టీ ఫిరాయింపులు జోరుగా ఉంటాయని చెబుతున్నారు. దాదాపు 40మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరిపై పుకార్లు వస్తే వారు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏపీలో ఉంది. ఇప్పటికే చాలామంది ఇలా వివరణలు ఇచ్చుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రాపాక వరప్రసాద్, మద్దాలి గిరి.. తమకు కూడా డబ్బుల ఆఫర్ వచ్చిందని, తాము తిరస్కరించామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరే బయటకొచ్చి, తాము జగన్ తోనే ఉన్నామని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేల విషయంలో పుకార్లు ఎక్కువగా రావడం విశేషం.