Attack On Satya Kumar :    భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో దాడి జరిగింది. మందడం గ్రామంలో మూడు రాజధానులకు మద్దతుగా  కొంత మంది శిబిరం నిర్వహిస్తున్నారు. అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై 1200 రోజులుఅవుతున్న సందర్భంగా .. వారికి సంఘిభావం ప్రకటించేందుకు సత్యకుమార్ వచ్చారు. ఆ తర్వాత తుళ్లూరులో పార్టీ నేత ఒకరిని పరామర్శించడానికి వెళ్లారు. ఆయన తుళ్లూరు నుంచి మందడంలోని మూడు రాజధానుల మద్దతు శిబిరం మీదుగా వెళ్తారన్న సమాచారం ముందుగానే తెలియడంతో కొంత మంది ముందుగానే ఆయనను అడ్డుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సత్యకుమార్ కాన్వాయ్ మందడం దగ్గరకు రాగానే కొంత మంది అడ్డుకున్నారు. మరికొంత మంది రాళ్లతో దాడి చేశారు. దీంతో సత్యకుమార్ కాన్వాయ్ కర్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి.  ప్రమాదాన్ని గుర్తించిన సత్యకుమార్ డ్రైవర్ కారును ముందుకు తీసుకెళ్లిపోయారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలపైనా దాడి చేశారు. 


బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ వాహనాన్నే ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడం వెనుక వ్యూహం ఉందని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలలో బీజేపీ అమరావతికి పూర్తి స్థాయిలో ప్రకటిస్తోంది. రాష్ట్రనేతలతో పాటు జాతీయ కార్యదర్శి హోదాలో ఉన్న సత్యకుమార్ కూడా అమరావతికి మద్దతుగా రైతులకు సంఘిభావం చెప్పడానికి వచ్చారు. ఇాలాంటి  సమయంలో ఆయనపై దాడి చేయడం ద్వారా కొంతమంది వ్యక్తులు సంచలనం సృష్టించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దాడికి పాల్పడిన వారిని ప్రాథమికంగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరులుగా గుర్తించారు., దాడి చేస్తున్న దృశ్యాల వీడియోలు వైరల్ అవుతున్నయి. ఈ అంశంపై నందిగం సురేష్ కూడా  స్పందించారు. ముందుగాతమ వారిపై దాడి చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. 


అయితే అసలు పరస్పరం ఘర్షణ పడటానికి  సత్యకుమార్ కారు మూడు రాజధానుల శిబిరం దగ్గర ఆగలేదని చెబుతున్నారు. రాళ్ల దాడికి పాల్పడటంతో కొంత మంది బీజేపీ కార్యకర్తలు కారు దిగి ప్రశ్నించారు. వారిపై ఇష్టం వచ్చినట్లుగా కొంత మంది యువకులు దాడి చేస్తున్న దృశ్యాలు వీడియోల్లో రికార్డు అయ్యాయి. పోలీసుల తీరు కూడా వివాదాస్పదమవుతోంది. పోలీసులు కూడా దాడి జరిగే వరకూ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం ప్రదర్శించారన్న ఆరోపణలను బీజేపీ నేతలు చేస్తున్నారు. జాతీయ స్థాయి నేతపైనే ఉద్దేశపూర్వకంగా  రాళ్ల దాడి చేయడంతో ఈ అంశాన్ని తేలిగ్గా వదిలి పెట్టబోమని బీజేపీ నేతలు చెబుతున్నారు. 


ఈ దాడిపై తక్షణం కేసు నమోదు చేయాలని డీజీపీని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. 


 





ఈ దాడి అంశం పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని బీజేపీ అరోపిస్తున్నారు.