Etikoppaka Toys : జనవరి 26, 2025న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో నిర్వహించిన పలు రాష్ట్రాల శకట ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏటికొప్పాక బొమ్మల కొలువు శకటం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. బొమ్మలమ్మ బొమ్మలు అంటూ సాగే పాటతో పరేడ్ లో చేసిన శకట ప్రదర్శన అన్ని వయసుల వారిని మంత్రముగ్దుల్ని చేసింది. ఎంతో చరిత్ర ఉన్న ఈ బొమ్మలు శకట రూపంలో దర్శనమిచ్చి జాతీయ స్థాయిలో రాష్ట్ర సృజనాత్మకతను చాటాయి. అయితే ఈ శకటం ఇప్పుడు దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఏటికొప్పాక బొమ్మల ప్రత్యేకత ఏంటీ, వీటిని ఎవరు, ఏ కర్రతో తయారు చేస్తారు అన్న విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఊరి పూరే ఈ బొమ్మలకు మారు పేరు
విశాఖపట్నం జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో గత 400 ఏళ్ల నుంచి ఈ బొమ్మలను తయారు చేస్తున్నారు. వరాహనది పక్కన ఉండే ఓ చిన్న గ్రామమే ఏటికొప్పాక. అలా ఊరి పేరే బొమ్మలకు మారుపేరుగా మారింది. ఈ గ్రామంలో ఎక్కడ, ఎవరింట్లో చూసినా ఒక కళాకారుడు తప్పక ఉంటాడు. అంకుడు కర్రతో సహజ రంగులనుపయోగించి అద్భుతమైన కళాఖండాలను తయారు చేయడం వీరి గొప్పతనం. చింతలపాటి వెంకటపతి అనే కళాకారుడు మొదటిసారిగా 1990లో రసాయన రంగుల స్థానంలో సహజ రంగులను వాడడం ప్రారంభించారు. అప్పట్నుంచి ఏటికొప్పాక బొమ్మలకు పూలు, చెట్ల బెరడుల నుంచి వచ్చిన రంగులనే వాడుతున్నారు.
ఏటికొప్పాక బొమ్మల ప్రత్యేకత ఏంటంటే..
ఈ ఏటికొప్పాక బొమ్మలను చెక్కతో తయారు చేస్తారు. ఏటికొప్పాక బొమ్మలు సృజనాత్మకతకు మరో పేరు. ఈ బొమ్మలు తయారు చేయడమంటే ఓ జీవికి ప్రాణం పోసిన దాంతో సమానంగా భావిస్తుంటారు కళాకారులు. ఎందుకంటే ప్రతి బొమ్మనీ విడిగా తయారు చేయాల్సిందే. అడవులలో దొరికే అంకుడు చెట్ల కొమ్మలను తెచ్చి ఎండబెట్టి ఈ బొమ్మలను తయారు చేస్తారు. పిల్లలు ఆడుకునే బొమ్మలు, గోడ గరియాలు, దేవుళ్ల బొమ్మలు వంటి ఇంట్లో అలంకరణకు వాడే వస్తువులతో పాటు ఇంకా చాలా రకాలైన బొమ్మలను కళాకారులు తీర్చిదిద్దుతారు. వీటిని వివాహాలు, గృహప్రవేశాలు, బొమ్మల కొలువుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక పర్యావరణహితమైన, సహజసిద్ధమైన వనరులతో చేసే ఈ బొమ్మల ప్రత్యేకత ఏంటంటే, వీటికి ఎక్కడా పదునైన అంచులుండవు. అంచులన్నీ గుండ్రని ఆకారంలో చేస్తారు. బొమ్ముకు అన్ని వైపులా గుండ్రంగా చేసి, సహజ రంగులను అద్దుతారు.
ఈ బొమ్మలకు కావల్సిన లక్క ఎక్కడ్నుంచే వస్తుందంటే..
ఏటికొప్పాక బొమ్మలకు అవసరమైన లక్కను రాంచీ నుంచి దిగుమతి చేసుకుంటారు. దీన్ని పసుపు, నేరేడు, వేప, ఉసిరి వంటి వాటి నుంచి వచ్చిన రంగులను బొమ్మలకు అద్దుతారు. వీటిని కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా విదేశాలకూ ఎగుమతి చేస్తుంటారు. ఈ బొమ్మల తయారీ ద్వారా ఏటికొప్పాక, కోటవురట్ల ప్రాంతాల్లోని వందలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ కళలో మహిళలకు సైతం శిక్షణ ఇచ్చి, ఉపాధి పొందేలా ప్రోత్సహిస్తోంది.
ఏటికొప్పాకకు ఎలా చేరుకోవాలంటే..
ఏటికొప్పాక బొమ్మలను నేరుగా కూడా కొనుగోలు చేయవచ్చు. అందుకోసం విశాఖపట్నం నుంచి బస్సు లేదా రైలు ద్వారా ఈ గ్రామాన్ని చేరుకోవచ్చు. ఇకపోతే ఈ గ్రామంలో బొమ్మల తయారీలో ఇద్దరికి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. సహజ రంగులతో బొమ్మలు తయారు చేసినందుకు సీవీ రాజు రాష్ట్రపతి అవార్డును అందుకోగా.. లక్క బొమ్మల తయారీకి గానూ శ్రీశైలపు చిన్నయాచారికి రాష్ట్రపతి అవార్డుతో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ 2010లో చోటు దక్కింది.